
‘హృదయాన్ని అద్దంలా..!
చూసుకో పదిలంగా..
కడప రూరల్ : మానవ శరీరంలో అన్ని శరీర భాగాలు కీలకమే. ప్రధాన భాగమైన గుండె పోషించే పాత్ర ఎంతో ప్రత్యేకమెంది. ఏదైనా సంఘటనను తట్టుకొని నిలబడినప్పుడు వాడికి ‘గుండె నిబ్బరం’ ఎక్కువరా..! అంటారు. అంటే గుండె సంపూర్ణ ఆరోగ్యకంగా ఉందనడానికి నిదర్శనం. అది ఎప్పుడో 30ఏళ్ల మాట. ఇప్పుడు గుండె జబ్బులు సాధారణ వ్యాధుల్లా మారాయి. ఎప్పుడు ఏ గుండె ఆగిపోతుందో తెలియని విధంగా ఆరోగ్య పరిస్థితులు మారాయి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతియేటా గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. ఉచిత వైద్యసేవ ద్వారా యేటా వేలాది మంది బైపాస్‌సర్జరీలు చేయించుకున్నారు. స్టంట్లు వేయించుకుని, ఎన్‌సీడీ కార్యక్రమాల ద్వారా గుండె జబ్బుగల వారికి వైద్య సేవలంన్నారు. ఆరోగ్యశ్రీకి రెఫర్ చేశారు. ఇలా పలు పథకాలు, నివేదికల ద్వారా గుండె వ్యాధుల తీవ్రతను తెలియపరుస్తోంది. జాగ్రత్తలతో హృదయాన్ని కాపాడుకుంటే పదికాలాలపాటు జీవించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
జీవనశైలి మార్పులతోనే
35 ఏళ్లకు ముందు ఏదైనా ఆహారం తినాలంటే నువ్వుల ఉండలు, వేరుశనగ ఉండలు, బఠానీలు, సంప్రదాయ పదార్థాలు లభించేవి. హోటళ్లలో కల్తీలేని ఆహార పదార్థాలు లభించేవి. నేడు ఆహారం విచ్చలవిడిగా లభిస్తూ మనిషి ప్రాణాల మీదకు తెస్తోంది. నూడుల్స్, బర్గర్లు, పిజ్జాల వంటి కార్పొరేట్ ఆహార పదార్థాల కారణంగా అనారోగ్యకరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చిన్న వయస్సులోనే ఊబకాయం వస్తోంది. అందులో కీలకమైనది గుండె. ఈ భాగంలో మార్పులు సంభవించడం, రక్తనాళాలు గడ్డకట్టుకుపోవడంతో గుండె వ్యాధులు, హార్ట్ స్టోక్‌లు వస్తున్నాయి.
గుండె నొప్పి లక్షణాలు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
ఛాతీలో మంట.. కొద్దిగా నడిచినా అయాసం
జీర్ణాశయం పైభాగాన నొప్పి
ఎడమచేయి, రెండు చేతుల్లో నొప్పి
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
సాధ్యమైనంత వరకు ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
బీపీ, షుగర్‌లను నియంత్రణలో ఉంచుకోవాలి.
45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
మంచి పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలి. కొవ్వు, నూనె, మసాల పదార్థాలకు దూరంగా ఉండాలి.
ఒత్తిడిని జయించడానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి.
నేడు ప్రపంచ గుండె దినోత్సవం
యుక్త వయసులోనే ‘గుండె’ లయ తప్పుతోంది. ‘గుండె నొప్పి’ కారణంగా ఉన్న ఫలంగా కుప్ప కూలిపోతున్నారు.. ప్రాణాలు విడిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలతో గుండెను పదిలంగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా.. ప్రత్యేక కథనం.