
రహదారులపై రక్తపు మరకలు !
జాతీయ రహదారులు రక్తపు మరకలతో నిండిపోతున్నాయి. కారణాలు ఏవైనా నిత్యం వాహనదారులు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నారు. ఒక వైపు అతివేగం, మరో వైపు పొంచి ఉన్న ప్రమాదాల వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురై ఆయా కుటుంబాలలో విషాదాన్ని మిగులుస్తున్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో జరిగిన ఘోర ప్రమాదాలు వందలాది కుటుంబాలలో చీకటిని నింపాయి.
రాయచోటి అర్బన్ : జిల్లాలోని పలు జాతీయ రహదాలు రక్తంతో తడిసిపోతున్నాయి. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఊహించని ప్రమాదాలలో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఆయా కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.
పొంచి ఉన్న ప్రమాదాలు ...
జాతీయ రహదారులలో జరుగుతున్న రోడ్డు అభివృద్ధి పనుల వద్ద సరైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల కూడా రాత్రి సమయంలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రాయచోటి పట్టణ పరిధిలోని గాలివీడు రింగు రోడ్డు సర్కిల్ నుంచి వేంపల్లి రోడ్డు సర్కిల్ వరకు రింగురోడ్డు పనులు గత కొన్ని నెలలుగా జరుగుతున్నాయి. అయితే ఇదే రహదారిలో మాండవ్య నది ప్రవహిస్తుండటం వల్ల గతంలో నిర్మించిన రెండు వంతెనలు ఉన్నాయి. ప్రస్తుతం పెరిగిన రోడ్డు వెడల్పుకు అనుగుణంగా ఆయా వంతెనల వెడల్పు పెరగకపోవడం వల్ల అక్కడ ఇటీవల పలుమార్లు ద్విచక్రవాహనదారులు, కారు, ఆటోలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదాలకు గుర య్యారు. సోమవారం రాత్రి పట్టణ పరిధిలోని గాలివీడు రింగురోడ్డు సర్కిల్ సమీపంలోని వంతెన వద్ద ద్విచక్రవాహనదారులు ప్రమాదానికి గురై లక్కిరెడ్డిపల్లె మండలం పాలెం చిన్నపోతులవాండ్లపల్లెకు చెందిన ముబారక్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, రెడ్డిశేఖర్ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ప్రమాదాల నివారణకు రవాణాశాఖ మంత్రి శాశ్వత పరిష్కారం చూపాలి..
ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఇదే జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవ తీసుకుని రోడ్డు ప్రమాదాల శాశ్వత నివారణకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది.
● ఇదే ఏడాది జూలైలో పుల్లంపేట మండలంలో జరిగిన మామిడి పండ్ల లారీ బోల్తా పడిన ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు.
● మే నెల 24వ తేదీన గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో జరిగిన ఒకే ప్రమాదంలో మరో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
● మే 30వ తేదీన కురబలకోట వద్ద జరిగిన కారు ప్రమాదంలో రాయచోటికి చెందిన మైనార్టీ యువకుడు మృతి చెందాడు.
● జూలై 11న సుండుపల్లి రోడ్డు మార్గంలో ఆటో, ద్విచక్రవాహన ప్రమాదంలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు గాయపడ్డారు.
● ఆగస్టు 9వ తేదీన చిన్నమండెం మండల పరిధిలో ట్రాక్టర్ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదాలకు అతి వేగం, రహదారుల్లో సూచిక బోర్డులు సరిగా ఏర్పాటు చేయకపోవడం కారణంగా తెలుస్తోంది. ఇప్పటికై నా రవాణాశాఖ మంత్రి చొరవ తీసుకుని ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపి అతివేగం, రోడ్డు భద్రతా నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. జాతీయ రహదారులతో పాటు ఇతర గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారుల్లో కూడా తప్పనిసరిగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి స్పీడ్ బ్రేకర్లతో పాటు , బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాల బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రమాదంలో మృతి చెందిన ముబారక్(ఫైల్)
ప్రమాదం జరిగిన తరువాత ఏర్పాటు చేసిన సూచిక బోర్డు
జాతీయ రహదారులపై
నిత్యం మృత్యు ఘంటికలు
ఒక వైపు అతివేగం,
మరో వైపు పొంచి ఉన్న ప్రమాదాలు
రహదారులపై కనిపించని
ప్రమాద సూచికలు
వాహనదారులకు అవగాహన తప్పనిసరి
ప్రమాదాల నివారణకు రవాణాశాఖ మంత్రి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్

రహదారులపై రక్తపు మరకలు !

రహదారులపై రక్తపు మరకలు !