
మెడికల్ ప్రైవేటీకరణపై దళిత గర్జన
సాక్షి రాయచోటి/రాయచోటి/టౌన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంపై అన్నమయ్య జిల్లా రాయచోటిలో దళిత వర్గాలు గర్జించాయి. వైఎస్ జగన్ సర్కారు హయాంలో మంజూరై బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటున్న వైద్య కళాశాలలను.. పీపీపీ విధానంలోకి చేర్చి అన్యాయం చేశారంటూ దండెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవలే మదనపల్లె మెడికల్ కళాశాల వద్ద ఆందోళనలు చేపట్టిన వైఎస్సార్‌సీపీ నేతలు.. ప్రభుత్వానికి కనువిప్పు కలగకపోవడంతో మరొకసారి ఆందోళన బాట పట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లా ఎస్సీసెల్ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దళిత వర్గాలు కదం తొక్కాయి. పేద ప్రజల నడ్డి విరిచేందుకే ప్రైవేటు వైపు మొగ్గు చూపారని.. ఈసారి జిల్లాలోని కళాశాలకు కేటాయించిన సీట్లను కూడా వెనక్కి పంపారంటూ సర్కార్‌పై నిరసనకారులు మండిపడ్డారు.
పీపీపీ విధానంపై నిరసన
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సిన మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ (పీపీపీ) విధానానికి కూటమి సర్కారు తేవడంపై ఎస్సీ సెల్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి మంగళవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్‌సీపీ దళిత శ్రేణులతోపాటు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా నేతాజీ సర్కిల్, ఠాణా మీదుగా మాసాపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అమరావతిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం పార్కును ప్రైవేటీకరణకు అప్పగించడం వంటి సమస్యలపై దళిత నాయకులు విశదీకరించారు.
అంబేడ్కర్ విగ్రహానికి వినతి
పార్టీ కార్యాలయం నుంచి మాసాపేటకు చేరుకుని అక్కడ ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ముందుగా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే నిలుచొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతోపాటు కూటమి సర్కార్ నిరంకుశ వైఖరిపై నినాదాలతో హోరెత్తించారు. అనంతరం బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. దళిత నాయకులతోపాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని అన్యాయంపై అంబేడ్కర్‌కు వేదన వినిపించారు. ‘వైద్య విద్య మా హక్కు, అమ్మకానికి కాదు, ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలి, జగన్ కలలను కాపాడుకుందాం–పీపీపీ కుట్రలను అడ్డుకుందాం, వైద్య విద్యను కార్పొరేట్ లాభాలకే కాదు–ప్రజల సేవకే ఇవ్వాలి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్కటై పోరాడదాం’ అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కమలాకర్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు చుక్కా అంజనప్ప, దండుగోపి, మారుతీ, హరి, రవీంద్ర, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎల్లప్ప, నరేష్ కుమార్, మాజీ ఎంపీటీసీ సగినాల శివ శంకర్, లోకేష్, నాగసుబ్బయ్య, జయరామచంద్రయ్య, ప్రసాద్, నాగమణి, రెడ్డయ్య, రాజ్ కుమార్, అంకె ఆంజనేయులు, పెంచలయ్య, రాజన్న, గంగులయ్య, రెడ్డయ్య, అశోక్, రామ్మోహన్ తదితర ఎస్సీ నేతలు పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపిద్దాం
రాబోయే ఎన్నికల్లో కూటమిని ఓడగొట్టి వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకొద్దాం. అప్పుడు ఈ 17 మెడికల్ కళాశాలలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పరం చేసి పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేస్తారు. – గుండ్లూరు జయరామ చంద్రయ్య,
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిఽధి
పేదలకు వైద్య విద్య దూరం
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేసి 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే.. వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు చేస్తోంది. మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం అయితే పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది. – లింగం లక్ష్మీకర్,
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, రైల్వేకోడూరు
ప్రభుత్వ వైద్య కళాశాలలుప్రైవేటుపరం చేయడంపై నిరసన
వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ఆధ్వర్యంలో ఆందోళన
కూటమి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు
అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రంసమర్పించిన నేతలు

మెడికల్ ప్రైవేటీకరణపై దళిత గర్జన

మెడికల్ ప్రైవేటీకరణపై దళిత గర్జన