
డీటీసీ కావలెను !
● 9 నెలలుగా రవాణాశాఖ కార్యాలయంలో సీటు ఖాళీ
● ఇన్‌చార్జి డీటీసీలతో
సరిపెడుతున్న అధికారులు
● సకాలంలో పనులు కాక సతమత మవుతున్న వాహనదారులు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో 9 నెలల నుంచి డీటీసీ సీటు ఖాళీగా ఉంది. గతంలో ఇక్కడ ఉన్న డీటీసీ చంద్రశేఖర్‌రెడ్డి లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డీటీసీ సీటు ఖాళీగానే ఉంది.
ఇన్‌చార్జి డీటీసీలతో విధులు..
రవాణాశాఖ అధికారులు ఇతర జిల్లాల అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించి వారితో విధులు నిర్వహింపజేస్తున్నారు. ఇప్పటికే మగ్గురు డీటీసీలు ఇక్కడ ఇన్‌చార్జిలుగా పని చేశారు. అన్నమయ్య జిల్లా డీటీసీ ప్రసాద్‌ను ఇన్‌చార్జిగా నియమించగా ఆయన నాలుగు నెలలు పని చేసి వెళ్లారు. తర్వాత చిత్తూరు డీటీసీ నిరంజన్ రెడ్డి మూడు నెలలు, అనంతరం ప్రస్తుతం అనంతపురం డీటీసీ వీర్రాజు ఇన్‌చార్జి డీటీసీగా వాహనదారులకు సేవలను అందిస్తున్నారు. ఆయన వారంలో బుధవారం, గురువారం మాత్రమే ఇక్కడ ఉంటూ కార్యకలాపాలను నడిపిస్తున్నారు. ఈ రెండు రోజులు మినహా మిగతా రోజుల్లో డీటీసీ లేకపోవడంతో వాహనదారులకు సకాలంలో సరైన సేవలు అందడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవాణాశాఖ కార్యాలయంలో అధికారుల కొరత ఉండటంతో ఉన్న సిబ్బందిపైనే భారం పడుతోంది. ఇతర ఏ శాఖలో అయినా అధికారి బదిలీ అయినా సస్పెండ్ అయినా వెంటనే వేరే అధికారిని నియమించే ప్రభుత్వం జిల్లా ఉప రవాణాశాఖ కార్యాలయానికి మాత్రం ఇంతవరకు రెగ్యులర్ డీటీసీని నియమించలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు.