
మాదిగలను విభజించే హక్కు చంద్రబాబుకు లేదు
మదనపల్లె రూరల్ : మాల మాదిగలను విభజించే హక్కు చంద్రబాబుకు లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. ఆగస్టు 3వ తేదీన కుప్పం నుంచి మొదలైన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఆదివారం అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చేరుకుంది. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శనం ఆధ్వర్యంలో ఈ మహా పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. నిమ్మనపల్లె సర్కిల్ నుంచి ప్రారంభమైన యాత్ర మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి ఎస్సీలు రోడ్లపైకి రావడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపాటుతో ఎస్సీ వర్గీకరణను తీసుకువచ్చి ఇపుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం అంటే 15 ఏళ్ల ముఖ్యమంత్రి పదవి అనుభవించడం కాదని, మాదిగను ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. అన్నదమ్ముల్లా ఉంటున్న దళితుల మధ్య లేనిపోని తగాదాలు పెట్టి, వారిని రోడ్లపైకి తీసుకువచ్చిన చంద్రబాబు వైఖరి తప్ప అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్డర్ కాదని, డైరెక్షన్ ఇచ్చిందని, దాని ఆధారంగా దళితులను విభజించడం దుర్మార్గపు చర్య అన్నారు. చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆఽశయాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు తూట్లు పొడుస్తున్నారన్నారు. దళితులకు అన్యాయం చేసే ప్రభుత్వాలను కూల్చడంతోపాటు, వారిపై చర్యలు తీసుకునేందుకు రాజ్యాంగంలో చట్టం తీసుకురావాలన్నారు. ఎస్సీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు, మాలమహానాడు రాష్ట్ర అఽధ్యక్షులు యమలాసుదర్శన్ మాట్లాడుతూ పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు 15 శాతం నుంచి 20 శాతానికి పెంచాలన్నారు. క్రిమిలేయర్ విధానాన్ని రద్దుచేయాలన్నారు. దళిత క్రిష్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్,
మాజీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప