
ప్రయాణం.. ప్రమాదకరం
గుర్రంకొండ: మండలంలోని టి.పసలవాండ్లపల్లె గ్రామం..అదొక మారుమూల ప్రాంతం. ఇరువైపులా కొండలు.. మధ్యలో 20 గ్రామాలతో పంచాయతీ విస్తరించి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు మాండవీయ నది వంక ఉధృతంగా ప్రవహించడంతో టి.గొల్లపల్లె వద్ద ఉన్న బ్రిడ్జి కుప్పకూలిపోయింది. పిల్లవాండ్లపల్లె వద్ద ఉన్న మరో బ్రిడ్జి సగం వరకు దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. అప్పటి నుంచి 20 గ్రామాలకు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు టి.గొల్లపల్లె వద్ద కొట్టుకుపోయిన బ్రిడ్జి స్థానంలో తాత్కలికంగా మట్టి, సిమెంట్ పైపులు వేసి రహదారిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటిపై చిన్న ఆటోలు, ద్విచక్రవాహనాలు మాత్రమే అతికష్టం మీద వెళుతున్నాయి. ఏదైనా పెద్ద వాహనం వచ్చిందంటే తాత్కాలిక బ్రిడ్జి కుంగిపోతుంది. ఇప్పటికే బ్రిడ్జి పై రంధ్రాలు కూడా ఏర్పడటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో అటువైపు వెళ్లే వాహనదారులు సగం దారి వరకు వచ్చి వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. కాగా పదిహేను రోజుల నుంచి ఈ మార్గంలో బస్సు కూడా తిరగడంలేదు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.
● రాయచోటి– అంగళ్లు జాతీయ రహదారికి పక్కనే కొండల మధ్య ఉన్న 20 గ్రామాలకు పదిహేను రోజులుగా బస్సు సర్వీసు నిలిపివేశారు. రాయచోటి నుంచి చిన్నమండ్యం, కేశాపురం, టి.పసలవాండ్లపల్లె మీదుగా కలిచెర్ల వరకు బస్సు సర్వీసు నడిపేవారు. ప్రతిరోజు 5 మార్లు బస్సు తిప్పేవారు. వివిధ పనుల మీద వందలాది మంది ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్లేవారు. మాండవీయనది వంకపై ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో ఉన్న ఒక్క బస్సు సర్వీసు నిలిచిపోయింది. దీంతో అధిక డ బ్బులు చెల్లించి ఆటోల్లో కేశాపురానికి చేరుకుంటున్నారు.కలిచెర్ల నుంచి రాయచోటి వెళ్లే మార్గం మూసుకుపోవడంతో అక్కడి ప్రజలు పెద్ద మండ్యం, గాలివీడుకు వెళ్లి రాయచోటికి చేరుకుంటున్నారు. పిల్లావాండ్లపల్లె హరిజనవాడ వద్ద ఉన్న సిమెంట్‌రోడ్డు దెబ్బతింది. దీనివల్ల కుమ్మరపల్లె, ఎగువ,దిగువ మొరంపల్లె,పిల్లావాండ్లపల్లె గ్రామాల ప్రజలు పంచాయతీకస్పా అయిన టి.పసలవాండ్లపల్లెకు చేరుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో 20 గ్రామాల ప్రజలకు ప్రమాదంపొంచి ఉంది.
టి.గొల్లపల్లె వద్ద మాండవీయనదిపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జి
దెబ్బతిన్న బ్రిడ్జిపై వెళుతున్న వాహనాలు
మాండవీయనది వంకపై కూలిపోయిన వంతెనలు
20 గ్రామాలకు రవాణా బంద్

ప్రయాణం.. ప్రమాదకరం