
చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
రాయచోటి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, హీరో చిరంజీవిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్నపాత్రుడు క్షమాపణ చెప్పడంతోపాటు బాలకృష్ణతోనూ క్షమాపణ చెప్పించాలన్నారు. రాష్ట్ర ప్రజలను అవమానించేలా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల తీరు కొనసాగుతోందని, కక్షపూరిత రాజకీయాలు చేయను అని చెబుతూనే తమ పార్టీ నాయకులకు వెనుక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దాడులు, బ్రిటీష్ తుగ్లక్ పాలనను మించి జరుగుతున్నాయన్నారు. హోమంత్రి, డిప్యూటీ స్వీకర్లు హద్దుమీరి మాట్లాడుతుండటం దారుణమన్నారు. తెలుగుదేశం మంత్రులు వ్యక్తిగతంగా దూషిస్తూ అసభ్య పదజాలతో రెచ్చిపోవడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. చిత్ర పరిశ్రమలో చిరంజీవితో పోటీపడలేక అక్కసు వెళ్లగక్కుతూ బాలకృష్ణ శాసనసభకు మచ్చతెచ్చారన్నారు. నాలుగేళ్ల కిందట అలాగా జనం, అలగా నా కొడుకు, సంకరజాతి వాడంటూ మాట్లాడిన బాలకృష్ణ ఇంకా తన తీరు మార్చుకోలేదన్నారు. ఎన్టీరామారావు కుమారుడు అని మరచిపోయి అసెంబ్లీలో ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. తన గన్నుతో ఒక మనిషిని కాల్చి చంపడానికి ప్రయత్నించిన బాలకృష్ణ సైకో కాదా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మెంటల్ సర్టిఫికెట్ తీసుకున్న బాలకృష్ణ స్వయం కృషితో ఎదిగిన చిరంజీవిని ఇంత ఘోరంగా అవమానిస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడం దుర్మార్గమన్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. అనేక సందర్భాలలో మహిళలను అవహేళన చేస్తున్నా.. రామారావు కుమారుడున్న కారణంగానే బాలకృష్ణను అందరూ గౌరవిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గడికోట శ్రీకాంత్‌రెడ్డి