మదనపల్లె రూరల్ : భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం మండలంలో జరిగింది. కోళ్లబైలు పంచాయతీ బాబూకాలనీకి చెందిన ఆసిఫ్ భార్య ప్రభావతి(25) భర్త ప్రతి రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి వేధిస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన ప్రభావతి ఇంటి వద్దే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
వివాహిత అదృశ్యం
నిమ్మనపల్లె : నెల రోజులుగా ఓ వివాహిత కనిపించడం లేదని కుటుంబసభ్యులు గురువారం స్థానిక మీడియాకు తెలిపారు. బోడిమల్లయ్యగారిపల్లెకు చెందిన హుస్సేన్ బీ, మహబూబ్‌ఖాన్ దంపతుల కుమార్తె నసీమా(21)ను తురకపల్లెకు చెందిన సుబహాన్‌ఖాన్‌కు ఇచ్చి ఐదేళ్ల కిందట వివాహం చేశారు. వీరికి కుమార్తె సహారా(4), కుమారుడు సాహిల్‌ఖాన్(3) ఉన్నారు. ఆగస్టు 22న రాత్రి 9గంటల సమయంలో నసీమా బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు.
అప్పటి నుంచి కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేసినట్లు తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. అయితే, అదృశ్యమై నెలరోజులు కావడంతో ఆమె ఆచూకీకై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు నిమ్మనపల్లె పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ ఫోన్ నెంబర్. 9440900706కు సమాచారం అందించాలన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
కడప అర్బన్ : నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నబీకోటకు చెందిన చెన్నకేశవరెడ్డి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి (25) దుర్మరణం చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఖాజీపేట మండలానికి చెందిన చెన్నకేశవరెడ్డి లారీడ్రైవర్ గా పనిచేస్తూ తన కుటుంబ సభ్యులతో నబీకోటలో నివాసముంటున్నాడు. పెద్ద కుమారుడైన చెన్నకేశవరెడ్డి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో నబీకోటకు చెందిన తన స్నేహితుడు యువకిషోర్‌తో కలిసి బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై అలంకాన్‌పల్లె వైపు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు.
మార్గ మధ్యంలో వినాయక నగర్‌కు వెళ్లే దారిలో ఓ కారును ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌రెడ్డికి తీవ్రగాయాలు కాగా స్థానికులు వెంటనే రిమ్స్ కు తరలించారు. చంద్రశేఖర్‌రెడ్డి చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకిషోర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చేతికొచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్‌ఐ జయరాములు తెలిపారు.

వివాహిత ఆత్మహత్యాయత్నం