నిప్పంటించుకొని షేక్ మహబూబ్ జాన్ మృతి
రాయచోటి : రెండు నెలల క్రిందట ఇద్దరు కుమార్తెలు, గురువారం తెల్లవారు జామున తల్లి మహబూబ్ జాన్ ఒకే ఇంటిలో శరీరంపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు సంచలనం కలిగించాయి. షేక్ మహబూబ్ జాన్ (49) గురువారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో శరీరంపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. రాయచోటి పూజారి బండ వీధిలోని సంగీత స్కూల్ సమీపంలో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలవరపాటుకు గురి చేస్తోంది.
ఈ ఏడాది జూలై 29న మహబూబ్ జాన్ కుమార్తెలు ఆప్రీన్, ఫాతిమాలు ఇదే ఇంటిలో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సంఘటన అన్ని వర్గాల మనస్సులను గాయపరిచింది. రెండు నెలల తరువాత అదే ఇంటిలో తల్లి ఈ అఘాయిత్యానికి పాల్పడడం స్థానికుల హృదయాలను కలిచివేసింది. షేక్ మహబూబ్ జూన్ అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో భర్త హుస్సేన్ ప్రక్క గదిలో నిద్రపోతున్నట్లు సమాచారం.
తమ పిల్లలు ఇద్దరి బాగోగులను తండ్రి హుస్సేన్ పట్టించుకోకపోవడంతోనే వారు చనిపోయారని, ఆ బాధతోనే తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు కొంతమంది స్థానికులు చెబుతున్నారు. అయితే భర్తే భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి చంపేసి ఉంటాడన్న అనుమానాలు, మహబూబ్ జాన్ బంధువులు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణను చేపడితే అసలు విషయాలు బయటకు వస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనపై రాయచోటి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.