
కమనీయం.. లక్ష్మీనరసింహుని కల్యాణం
గుర్రంకొండ : మండలంలోని తరిగొండలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవం గురువారం కన్నుల పండువగా జరిగింది. స్వాతి నక్షత్రం రోజు కావడంతో ఆలయంలో చలువపందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లివేదిక అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకం, అర్చనలు, పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామికి క్షీరాభిషేకం నిర్వహించారు. రంగురంగుల పుష్పాలతో స్వామిని అలంకరించి వేద మంత్రోచ్ఛారణ మధ్య శాస్త్రోక్తంగా కల్యాణం జరిపారు. పాల్గొన్న దంపతులకు టీటీడీ పట్టు వస్త్రాలు, కంకణాలు, స్వామి ప్రసాదాలు అందజేశారు.
ముగిసిన పవిత్ర ఉత్సవాలు : గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్ర ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఈ సందర్భంగా హోమాలు నిర్వహించి మహా పూర్ణాహుతి గావించారు. ఉత్సవాలు ముగిసినందున వరుణదేవుడ్ని ఆహ్వానిస్తూ పవిత్ర జలాలతో స్వామివారికి చక్ర స్నానం చేయించారు. అంనతరం వాహనంలో కొలువుదీర్చి గ్రామోత్సవం జరిపారు. పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని స్వామికి పూజలు నిర్వహించారు. అర్చకులు గోపాలబట్టర్, కృష్ణ, రాజు, గోకుల్‌స్వాములు పాల్గొన్నారు.

కమనీయం.. లక్ష్మీనరసింహుని కల్యాణం