
అంతర్ జిల్లాల దొంగల అరెస్టు
రాయచోటి : పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి తెలిపారు. వారి నుంచి రూ.4.70 లక్షల విలువైన ఆస్తులు రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. రాయచోటి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామానికి చెందిన రెపన బాలాజీ (19), మండెం సాయికుమార్ (28)లు బీటెక్ వరకు చదువుకున్నారని తెలిపారు. చిన్నమండెం మండల పరిధిలో జరిగిన దొంగతనాలపై ఆరాతీస్తున్న సమయంలో పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దొంగలించిన డబ్బులో కొంత ఆన్‌లైన్ బెట్టింగులకు ఖర్చుచేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. వారి నుంచి బంగారు నగలు, నగదు, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రాయచోటి అర్బన్ పోలీసు స్టేషన్, కడప చిన్న చౌక, కడప పాతబస్టాండ్ మరికొన్ని జిల్లాల పరిధిలో వారు దొంగతనాలకు పాల్పడినట్లు తమకు సమాచారం ఉందన్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన రాయచోటి డీఎస్పీ ఎంఆర్.కృష్ణమోహన్, రూరల్ సీఐ వరప్రసాద్, చిన్నమండెం ఎస్‌ఐ సుధాకర్, సిబ్బందిని ఎస్పీ ప్రశంసించారు.
ఎస్పీ ధీరజ్ కనుబిల్లి