
పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోకి చింతల
సాక్షి రాయచోటి/పీలేరు : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ బలోపేతం చేస్తూనే మరోవైపు కార్యకర్తలు, శ్రేణులు, నేతలను మాజీ సీఎం,వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యోన్ముఖులను చేస్తున్నారు. ఇదే తరుణంలో వ్యవహరించాల్సిన విధానాలపై ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూనే ప్రజా పోరాటాలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. పార్టీలో కీలకంగా వ్యవహారిస్తూ సీనియర్ నాయకులుగా గుర్తింపు పొందిన వారికి వైఎస్సార్ సీపీ పదవులను కట్టబెడుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత, పీలేరుమాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్‌గా అవకాశం కల్పించారు.
అన్నమయ్య జిల్లా పీలేరుకుచెందిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చింతల రామచంద్రారెడ్డి తండ్రి చింతల సురేంద్రారెడ్డి కూడా మంత్రిగా, ఎమ్మెల్యేగా సేవలు అందించారు. రాజకీయ ప్రాబల్యం కలిగిన చింతల కుంటుంబం ఎప్పుడూ ప్రజా సేవలోనే ఉంటోంది. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి గుర్తింపు పొందిన చింతల రామచంద్రారెడ్డికి పార్టీలో కీలక పదవి దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డికి
కృతజ్ఞతలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీలో కీలకమైన స్థానం రావడానికి కృషి చేసిన చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలకు చింతల రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తనపై నమ్మకముంచి అడ్వయిజరీ కమిటీలో కీలక పదవి ఇచ్చిన పార్టీ అధినేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చింతల తెలియజేశారు. ఎప్పుడూ ఏ అవసరం వచ్చినా పీలేరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోఉంటానని, ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు పోరాటాలే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి తెలియజేశారు.
వైఎస్ జగన్‌ను కలిసిన చింతల
కలికిరి : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ గురువారం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం మైనార్టీ కమిషన్ మాజీ చైర్మన్ కుమారుడు డాక్టర్ జుల్‌ఫికర్ అహ్మద్ ఖాన్(వకార్) వివాహ కార్యక్రమానికి మాజీ సీఎంను ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు చింతల ఆనందరెడ్డి, డాక్టర్ మొహివుద్దీన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.