
స్వచ్ఛత జీవితంలో భాగం కావాలి
రాయచోటి : ‘అందరి జీవితంలో స్వచ్ఛత ఒక భాగం కావాలి.. మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. ఇది నిత్య ప్రక్రియ.. నిరంతరం సాగాలి’ అని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్చతాహీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం రాయచోటిలోని వీరభద్ర స్వామి ఆలయం నుంచి మార్కెట్ యార్డు వరకు రోడ్లు, కాలువలను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. ఇందులో పారిశుధ్య కార్మికులతో పాటు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఏక్ దిన్ ఏక్ గంట, ఏక్ సాథ్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు. ఇందులో మున్సిపల్ సిబ్బంది, పబ్లిక్ హెల్త్ వర్కర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు కలిసి ఒక గంట శ్రమదానం చేసి శుభ్రత కోసం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవి, ఎల్‌డీఎం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫిరెన్స్ హాల్‌లో నీటిపారుదల శాఖ ఎస్‌ఈ, ఈఈలు, డీఈఈ, ఏఈఈ, ఏఈలతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువలు, శ్రీనివాసపురం రిజర్వాయర్, అడవిపల్లి రిజర్వాయర్, అన్నమయ్య ప్రాజెక్టు, వెలిగల్లు ప్రాజెక్టు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పింఛా, జరికోన, బహుదా, పెద్దేరు ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువ, భూసేకరణకు సంబంధించిన గ్రామం, మండల, విస్తరణ వివరాలను తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్