
గుట్టల్లో గుట్టుగా విద్యార్థుల ‘షూ’లు
పెద్దతిప్పసముద్రం : జిల్లాలోని పెద్దతిప్పసముద్రం నుంచి బి.కొత్తకోటకు వెళ్లే మెయిన్ రోడ్డు నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న బోడిగుట్ట వెనుక భాగాన గుట్టల నడుమ ఉన్న బీడు పొలాల్లో విద్యార్థుల పాదరక్షలు (షూలు) దర్శనమిచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విధ్యార్థుల కాళ్లకు ఉండాల్సిన షూలు పొలాల్లో ఉండటం గురువారం చూసి పశువుల కాపరులు అవాక్కయ్యారు. కొత్తగా ఉండటంతో అటుగా వెళ్లిన కొందరు వాటిలో కొన్ని జతలు తీసుకెళ్లినట్లు సమాచారం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 జతలకు పైగా షూలను ప్లాస్టిక్ సంచుల్లో నింపి నాలుగు చక్రాల వాహనం ద్వారా నిర్మానుష్యంగా ఉండే ప్రదేశంలో ఎందుకు పడేశారో అర్థం కావడం లేదు. ఈ షూలు ఏ మండలానికి సంబధించినవో తెలియాల్సి ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరై మిగిలిపోయిన షూలు అని కక్షపూరితంగా పడేశారా లేక విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో పడేశారా అనేది ప్రశ్నార్థకం. ఏది ఏమైనా వీటి కోసం వెచ్చించిన రూ.లక్షల ప్రజాధనం దుర్వినియోగం అయినట్లేనని పలువురు విమర్శిస్తున్నారు.