
సర్కారు భూమి.. అయితేనేం!
● ప్రభుత్వ భూముల్లో సూచిక బోర్డులు ఉన్నా లెక్కచేయని కూటమి నేతలు
● యథేచ్ఛగా ఆక్రమణలు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ భూముల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూచిక బోర్డులు యథేచ్ఛగా తొలగించి దర్జాగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారు. పుల్లంపేట మండలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 400 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. పేదవారికి సెంటు భూమి ఇవ్వాలంటే సవాలక్ష ఆంక్షలు. దోచుకున్నవారికి దోచుకున్నంత చందంగా ప్రస్తుత పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వానికి రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు అధికమవుతున్నాయి. రాత్రివేళల్లో ప్రభుత్వ భూమిని చదును చేయడం, పగటిపూట నిర్మానుష్యంగా ఉండటం పరిపాటిగా మారింది. పుల్లంపేట మండలం, వత్తలూరు పంచాయతీ సర్వే నంబరు 1, 2, 3లలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. అలాగే అనంతయ్యగారిపల్లిలో ఏపీ మోడల్ స్కూల్ వెనుకవైపున డంపింగ్ యార్డు వద్ద (చెత్తనుండి సంపద కేంద్రం) రాత్రులలో భూమిని చదును చేయడం, పగలు పనులు ఆపివేయడం జరుగుతోంది. రోజురోజుకు ఆక్రమణదారులకు అడ్డూ అదుపులేకుండా పోయింది. అలాగే పెరియవరం రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు. 143, 144,145లలో తోపు పొరంబోకు భూమి ఉంది. ఈ భూమిని గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు చట్ట విరుద్ధంగా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. పక్కనే ఉన్న స్మశానం సైతం ఆక్రమణకు గురైంది. పలుమార్లు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా కూటమి అండతో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. గతంలో వీఆర్‌ఓగా పనిచేసిన మల్లికార్జున కాసులకు కక్కుర్తిపడి జిల్లా అధికారులకు తప్పుడు నివేదికలు అందించారు. అలాగే రంగంపల్లి రెవెన్యూ గ్రామం సర్వే నెంబరు. 417లో ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని కూటమి నాయకులు ఆక్రమించుకొని చెట్లను పెంచుతున్నారు. ఇప్పటికై నా జిల్లాస్థాయి అధికారులు పుల్లంపేటలోని భూ ఆక్రమణలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.