రాయచోటి : సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి హెచ్చరించారు. సోషల్ మీడియా మంచి విషయాలను పంచుకోవడానికి, దూరంగా ఉన్న మిత్రులు, బంధువులను దగ్గర చేయడానికి ఒక అద్భుత వేదిక అన్నారు. కానీ అదే వేదికను కొంతమంది అవాస్తవాలు, పుకార్లు, విద్వేషపూరిత పోస్టుల కోసం వాడుతుండటంతో శాంతి భద్రతలకు భంగం కలుగుతోందన్నారు. జిల్లా ఎస్పీ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రూపుల్లో ఫేక్ న్యూస్ లేదా పుకార్లు వస్తే గ్రూప్ అడ్మిన్‌లపై చర్యలు తీసుకుంటామన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు పెట్టరాదన్నారు. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని సూచించారు. మహిళలు, చిన్నారులపై అసభ్యకర పోస్టులు, ఫోటో మార్ఫింగ్ చేసినా సహించమన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు జిల్లా స్థాయిలో సైబర్ క్రైమ్ సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెల్ అండ్ సోషల్ మీడియా సీఐ ఎస్.మహమ్మద్ అలీ, టెక్నికల్ అనాలసిస్ వింగ్ ఆర్‌ఐ టి.జాన్ జోసఫ్, సోషల్ మీడియా అండ్ సైబర్ సెల్, టెక్నికల్ అనాలసిస్ వింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆయుధాల గది సందర్శన..
ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లోని ముఖ్యమైన విభాగాలను జిల్లా ఎస్పీ సందర్శించారు. ఆయుధాల గది, స్టోర్ రూమ్, అడిషనల్ ఎస్పీ, ఏఆర్ డీఎస్పీ, ఆర్‌ఐ అడ్మిన్, ఆర్‌ఐ వెల్ఫేర్, ఎంటీఓ, స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్‌బీ, సైబర్ సెల్, ఐటీ కోర్ టీమ్, స్పెషల్ పార్టీ, మహిళా పోలీసు స్టేషన్, త్రిబుల్ సి, కమ్యూనికేషన్, అడ్మినిస్ట్రేషన్, హోంగార్డ్స్ కార్యాలయాలను సందర్శించారు. ఆయన వెంట ఏఏఓ జె.త్రినాథ సత్యం, ఎస్‌బీ సీఐ పి.రాజా రమేష్, డీసీఆర్‌బీ సీఐ ఎం.తులసీ రామ్, క్రైమ్ సీఐ ఎం.చంద్రశేఖర్, టాస్క్‌ఫోర్స్ సీఐ టి.మధు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.