
ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్త ఉద్యమం
మదనపల్లె రూరల్ : ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు భారతీయ అంబేద్కర్ సేన(బాస్) నేషనల్ కోఆర్డినేటర్ దుర్గం సుబ్బారావు స్పష్టంచేశారు. సెప్టెంబర్ 24 పూనా ఒప్పంద దుర్దినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే), బాస్ ఆధ్వర్యంలో రాజ్యాంగం–రాజకీయ హక్కులు–ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గం సుబ్బారావు మాట్లాడుతూ.. లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలతో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలు, మహిళలు, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ వర్గాలు విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరమయ్యారన్నారు. విద్య,వైద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేయడంతో 85శాతం అవకాశాలు ప్రైవేట్‌రంగంలోకి వెళ్లిపోయాయన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న 15శాతం ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్ వర్గాలకు దక్కడం లేదన్నారు. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ,ఎస్టీలకు 25శాతం నిధులు కేటాయించేందుకు చేసిన సబ్‌ప్లాన్ చట్టాలు అమలుకావడం లేదన్నారు. ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమం నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో బాస్, వీసీకే నాయకులు కే.వి.రమణ, పల్లంతాతయ్య, ముత్యాలమోహన్, పాలకుంట శ్రీనివాసులు, కడప రమణ, నంద్యాల శ్రీపతి, నీరుగట్టిరమణ, పీర్‌బాషా, వి.దొరస్వామి, అనంతపురం ఓబులేషు, కర్నాటక డీఎస్‌ఎస్ మునెప్ప, శ్రీనివాసులు, మునివెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.
బాస్ నేషనల్ కోఆర్డినేటర్ దుర్గం సుబ్బారావు