సాక్షి ప్రతినిధి, కడప : తెలుగుదేశం పార్టీలో ముదిరిన వర్గ విభేదాల కారణంగా కడప గడపలో ఉద్రిక్తత పెరిగింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ప్రశాంత కడపలో ఏదొక రచ్చ జరుగుతూనే ఉంది. తాజాగా పచ్చ పార్టీలో వర్గ పోరు వీటికి మరింత ఆజ్యం పోసింది. ఎమ్మెల్యే మాధవి రెడ్డి వైఖరిపై పాతకడప సింగిల్‌విండో అధ్యక్షుడు కృష్ణారెడ్డి నేతృత్వంలో ఓ వర్గం నిరశన చేపట్టిన విష యం తెలిసిందే. ఆపై రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి వద్దకు వెళ్లి కార్యకర్తలకు రక్షణగా నిలవాలంటూ అభ్యర్థించారు. ఇదంతా జరిగి మూడు రోజులైన గడవకముందే కృష్ణారెడ్డి లీజుకు తీసుకున్న ఓ గ్రావెల్ క్వారీలో ఉన్న జేసీబీని బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే మాధవి వర్గీయులు ధ్వంసం చేయడం వర్గపోరులో మరింత మంట రాజేసింది.
కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విశేషంగా పనిచేసిన నేతలంతా క్రమేపీ అసంతృప్తివాదులుగా మారారు. అందులో కొందరు మౌనం దాల్చితే.. మరికొందరు బాహాటంగా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈక్రమంలో అధిష్టానానికి ఫిర్యాదు చేశారనే నేపంతో నగర కమిటీ మాజీ అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డిపై హత్యాయత్నం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే తనపై హత్యాయత్నం చోటు చేసుకున్నట్లు ఆ తర్వాత శివకొండారెడ్డి బహిర్గతం చేశారు. తాజాగా గత సోమవారం పాతకడప కృష్ణారెడ్డి దేవునికడపలో నిరశన చేపట్టి ఆ తర్వాత మాచిరెడ్డిపల్లెలో ఉన్న పుత్తా నరసింహారెడ్డిని కలిశారు. కడపలో టీడీ పీ కార్యకర్తలకు రక్షణగా నిలవాలంటూ కోరారు. ఈ పరిస్థితుల్లో బుధవారం రాత్రి కృష్ణారెడ్డి లీజుకు తీసుకున్న ఓ గ్రావెల్ క్వారీలో ఉన్న జేసీబీని ధ్వంసం చేయడం గమనార్హం.
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి వర్గీయులు అక్రమ క్వారీ నిర్వహిస్తూ గ్రావెల్ ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. అధికారికంగా ఐదు క్వారీలు ఉండగా వాటికీ రాయల్టీ ఇవ్వకుండా మైనింగ్ అధికారులు శల్యసారధ్యం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన నేతలు పరపతి ఆధారంగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు.