
యూరియా.. ఇవ్వండయ్యా !
బి.కొత్తకోట : అయ్యా.. యూరియా ఇవ్వండయ్యా అంటూ బి.కొత్తకోటలో రైతులు బుధవారం తెల్లవారుజాము నుంచే రోడ్లపై క్యూ కట్టారు. ఇచ్చేది బస్తా.. దాని కోసం గంటల తరబడి క్యూలైన్లో నిలుచోవాలి. ఎప్పుడు స్టాక్ లేదని అంటారో అని మరోవైపు దిగులు. యూరియా కొరతలేదు అంటున్న కూటమి ప్రభుత్వానికి ఈ క్యూలైన్లు సమస్యను కళ్లకు కట్టినట్టు చూపుతున్నాయి. బి.కొత్తకోట గ్రోమోర్ కేంద్రానికి యూరియా వచ్చిందన్న సమాచారంతో ఉదయం ఆరు గంటలకే రైతులు పట్టాదారు పాసుపుస్తకాలతో కేంద్రం వద్దకు చేరుకున్నారు. గుంపుగా రావడంతో పోలీసులు క్యూలైన్ పెట్టారు. ఈ కేంద్రం నుంచి కేవలం 214 బస్తాలే పంపిణి చేసి అయిపోయిందని చెప్పడంతో రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. మండలంలోని గోళ్లపల్లెలో 214 బస్తాల యూరియాను అందించినట్టు వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు.