
ఇంటర్ పరీక్ష ఫీజుకు వేళాయె
రాయచోటి జగదాంబసెంటర్: వచ్చే విద్యా సంవత్సరంలో నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి తొలి అడుగు పడింది. పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లింపునకు అక్టోబర్ 10వ తేదీ తుది గడువుగా ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది. 2026 మార్చిలో జరగనున్న పరీక్షలకు ఈ నెల 15 నుంచి చెల్లించే విధంగా బోర్డు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అపరాధ రుసుం లేకుండా చెల్లించేందుకు అక్టోబర్ 10 వరకు గడువు విధించారు. అక్టోబర్ 11 నుంచి 21 వరకు వెయ్యి రూపాయల అపరాధ రుసుంతో చెల్లించే అవకాశం ఉంది. అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజును చెల్లించేందుకు విద్యార్థులు అప్రమత్తమవ్వాలని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు.
పరీక్ష ఫీజుల చెల్లింపు ఇలా
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్/ఒకేషనల్ విద్యార్థులు థియరీ పరీక్ష నిమిత్తం రూ.600 చెల్లించాల్సి ఉంది. జనరల్ కోర్సులు చదివే సైన్స్ విద్యార్థులు ప్రాక్టికల్స్ (సెకండియర్ విద్యార్థులు మాత్రం) రూ.275 చెల్లించాల్సి ఉంది. ఒకేషనల్ కోర్సు చదువుతూ బ్రిడ్జి కోర్సు చేసే విద్యార్థులు బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులకు పరీక్ష రుసుంగా రూ.165 చెల్లించాల్సి ఉంటుంది. సెకండియర్ చదువుతూ ఫస్టియర్ సబ్జెక్టులు ఫెయిలైన విద్యార్థులు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం థియరీ ఫీజు కలిపి రూ.1200 చెల్లించాలి. ఒకేషనల్ కోర్సు చదువుతూ ఫస్టియర్, సెకండియర్ ప్రాక్టికల్స్ రాసే విద్యార్థులు రెండేళ్లకు కలిపి రూ.550 చెల్లించాలి. బ్రిడ్జి కోర్సు చదివే విద్యార్థులు రెండేళ్ల పరీక్ష ఫీజు కడితే రూ.330 చెల్లించాలి. ఫస్టియర్, సెకండియర్ పాసై ఉండి, మార్కులు ఇంప్రూవ్‌మెంట్‌కు పరీక్ష రాసే ఆర్ట్స్ విద్యార్థులు రూ.13.50 వంతున సైన్స్ విద్యార్థులు రూ.1600 వంతున చెల్లించాలి.
గడువులోగా చెల్లించాలి
పరీక్ష ఫీజును గడువులోగా చెల్లించాలని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు ఆదేశాలు ఇచ్చాం. గడువు ముగిసిన తర్వాత అపరాధ రుసుంతో చెల్లించాల్సి వస్తుంది. – రవి, ఇంటర్మీడియట్ జిల్లా
విద్యాధికారి, అన్నమయ్య జిల్లా
తుది గడువు అక్టోబర్ 10
ఆలస్యమయ్యే కొద్దీ పెరగనున్న అపరాధ రుసుం