
నవోదయ దరఖాస్తుల గడువు పొడిగింపు
రాజంపేట: ఉమ్మడి వైఎస్‌ఆర్ కడప జిల్లాకు సంబంధించిన రాజంపేట మండలం నారమరాజుపల్లెలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తుల గడువు పొడిగించామని ప్రిన్సిపాల్ గంగాధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–2027 విద్యాసంవత్సరానికి అక్టోబరు 7 వరకు గడువు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2027 ఫిబ్రవరి 7న అర్హత పరీక్ష ఉంటుందని వివరించారు.
రాయచోటి టౌన్: రవాణాశాఖ అధికారులు తనిఖీల్లో పట్టుకున్న వాహనాలను అక్టోబర్ 4న వేలం వేస్తున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారి ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజంపేట ఆర్టీసీ డిపోలో ఉద యం 10 గంటలకు వేలం ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ధరావత్తుగా రూ.5 వేలు చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చని తెలిపారు. పాల్గొనే వారు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించి టోకెన్ పొందాలని సూచించారు. వాహనాల వివరాలు అన్నమయ్య జిల్లా రవాణాశాఖ కార్యాలయ నోటీస్ బోర్డులో ఉన్నట్లు వివరించారు.
కమలాపురం: కమలాపురం పెద్దదర్గాగా వెలుగొందుతున్న దర్గా–ఏ–గఫారియాలో బుధవారం రాత్రి దస్తగిరి షా ఖాద్రి బర్సీ నిర్వహిస్తున్నట్లు దర్గా కన్వీనర్, వైఎస్సార్ సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ షేక్ ఇస్మాయిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 7 గంటలకు స్వామి వారికి పూల చాదర్లు సమర్పించి, అనంతరం గంధం ఎక్కిస్తారని ఆయన అందులో పేర్కొన్నారు. రాత్రి అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. భక్తులు విరివిగా హాజరై కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
రాయచోటి టౌన్: 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కోసం స్థానిక స్థాయి నుంచి అందరం కలసికట్టుగా పని చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అన్నారు. మంగళవారం రాయచోటిలోని కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాల్‌లో పంచాయతీ పురోగతిపై సూచిక 2.0పై జిల్లాలోని అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ (ఎంఓపీఆర్) రూపొందించిన పంచాయతీ పురోగతిపై సూచిక 2.0(పీఏఐ–2.0) శిక్షణ బేస్‌లైన్ డేటాను అందిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రణాళికను జాతీయ స్థాయిలో ఉన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్‌డీజీలు) అనుసంధానం చేయడానికి వ్యూహాత్మక సాధనంగా పని చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నవోదయ దరఖాస్తుల గడువు పొడిగింపు