
ములకలచెరువు: అయ్యో దేవుడా మా మీద దయలేదా.. ఎంత పని చేశావయ్యా.. మూడు కుటుంబాల్లో ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు.. వారూ తనువు చాలించారు.. మాకెందుకయ్యా ఇంత వేదన ఇచ్చావంటూ మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ విలపించిన దృశ్యం చూపరుల హృదయాలను కలచి వేసింది.
మండలంలోని పెద్దపాళ్యం ఫ్లై ఓవర్ వద్ద ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో వేపూరికోట పంచాయతీ కుటాగోళ్లపల్లెకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన పాఠకులకు తెలిసిందే. కె.చంద్రప్ప కుమారుడు కె.వెంకటేష్ (26), కె.వేమనారాయణ కుమారుడు తరుణ్ (21), కె.ఓబులేసు కుమారుడు కె.మనోజ్ (20)లు ములకలచెరువుకు వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందించారు. వీరి అంత్యక్రియలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు.
కుటుంబ సభ్యుల రోదన చూపరులకు కంట తడిపెట్టించింది. ఉద్యోగాలు చేసుకుంటూ బెంగళూరులో ఉంటున్న ముగ్గురు ఒక్కసారిగా మృతి చెందడంతో కుటాగోళ్లపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బరువెక్కిన గుండెలతో మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు. అదేవిధంగా బురకాయలకోట పంచాయతీ ఎరమాసివారిపల్లెకు చెందిన శ్రీనివాసులు (45) గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఆదివారం రాత్రి మృతి చెందాడు. ములకలచెరువు పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.