బి.కొత్తకోట : పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌కు పతంజలి, ఒబెరాయ్ హోటల్స్ వస్తున్నాయని కలెక్టర్ శ్రీధర్ వె వెల్లడించారు. బుధవారం ఆయన మండలంలోని హర్సిలీహిల్స్‌పై టౌన్‌షిప్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులను జాయింట్ కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్ర, సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్‌లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ హార్సిలీహిల్స్‌లో పతంజలి కార్యకలాపాల నిర్వహణపై టూరిజంతో అవగాహన ఒప్పందం చేసుకుంటుందని, భూ కేటాయింపు కావాలని కోరలేదని స్పష్టం చేశారు. టూరిజం నిర్వహణలోని భవనాల్లోనే పతంజలి కార్యకలాపాలు సాగిస్తుందని చెప్పారు. ఒబెరాయ్ సంస్థకు 20 ఎకరాలు కేటాయించామని, ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నాక ఇక్కడ చర్యలు ప్రారంభిస్తారని అన్నారు. ఖరీఫ్ వ్యవసాయం 9.9శాతానికి పరిమితమైందని, భూగర్భజలాలు అడుగంటిపోయిన కారణంగా ప్రత్యామ్నయ చర్యలు చేపడతామని చెప్పారు. తంబళ్లపల్లె నుంచి రైలులో ఢిల్లీకి టమాట తరలించేలా కసరత్తు చేస్తున్నామని చెప్పారు. హార్సిలీహిల్స్‌పైకి వచ్చే సాధారణ పర్యాటకుల సంఖ్య పెరిగిందని చెప్పారు.
మందుబాబుల కట్టడి, పారిశుద్ధ్యంపై చర్యలు
కుటుంబాలతో వచ్చే సాధారణ పర్యాటకులకు మందుబాబు కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా భధ్రతా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. ఐ లవ్ హార్సిలీహిల్స్ బోర్టులోని అక్షరాలను మందుబాబులు ధ్వంసం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని గాలిబండపై ఏర్పాటు చేసి రోజులు గడవకనే ధ్వంసం చేయడం సరి కాదన్నారు. దీనికోసం నలుగురు సెక్యూరిటీ గార్డులను నియమించి వారితో భద్రత కొనసాగిస్తామన్నారు. పారిశుధ్య పనులకు పది మంది కార్మికుల నియామకం, వాకింగ్ ట్రాక్ నిర్మాణం,వీధిదీపాల కోసం టెండర్లు పిలిచినట్టు చెప్పారు. వీఎస్‌ఆర్ భవనం అద్దె నెలకు రూ.50వేల నుంచి రూ.1.80 లక్షలకు పెంచామని, రెవెన్యూ అతిథిగృహం నెలకు రూ.1.05 లక్షలకు అప్పగించామని చెప్పారు. కొండపై కొత్తగా నిర్మించిన, ఏర్పాటు చేసిన వాటర్‌ఫాల్స్, వెల్‌కం హార్సిలీహిల్స్, ఐ లవ్ హార్సిలీహిల్స్ బోర్డులు, జిడ్డు సర్కిల్, వివేకానంద సర్కిళ్లకు జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించారు. తహసీల్దార్ ఎ.బావాజాన్, కమీషనర్ జీవీ.పల్లవి, ఎంపీడీఓ కృష్ణవేణి, ఆర్‌ఎస్‌డీటీ బాలాజీ, ఆర్‌ఐ వీరాంజనేయులు, వీఆర్‌ఓ జయరామిరెడ్డి, టూరిజం మహేష్ బుజ్జి, ఉద్యోగులు పాల్గొన్నారు.
అభివృద్ది పనులు తిలకించిన కలెక్టర్ శ్రీధర్