
పొలం కంచె ధ్వంసం
రాజంపేట : మండలంలోని పెద్దకారంపల్లె పరిధిలోని మిట్టపల్లె ప్రాంతంలో ఈశ్వరరాజు అనే రైతుకు సంబంధించి పొలం కంచెను బుధవారం కొందరు ధ్వంసం చేశారు. లింగంపల్లె గ్రామానికి చెందిన హస్తి వెంకట్రాజు, లక్ష్మీకర్‌రాజు, భానుప్రకాశ్‌రాజు తన పొలం కంచెను ధ్వంసం చేశారని బాధిత రైతు మన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
సిద్దవటం : మండలంలోని కడప– చైన్నె జాతీయ రహదారిలోని మిట్టపల్లె సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయని ఎస్‌ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. సిద్దవటం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాఘవేంద్ర మాధవరం–1 నుంచి ద్విచక్ర వాహనంలో స్టేషన్‌కు వెళ్తున్నారు. మిట్టపల్లె గ్రామానికి చెందిన సోమశేఖర్ ద్విచక్ర వాహనంలో మాధవరం–1కు వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఇరువురి వాహనాలు ఢీకొన్నాయి. రాఘవేంద్రకు తీవ్రగాయాలవగా 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సోమ శేఖర్‌కు స్థానికంగా ప్రథమ చికిత్స చేయించి రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
వేర్వేరు ఘటనల్లో
ఇద్దరు మహిళల అదృశ్యం
నిమ్మనపల్లె : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు అదృశ్యం కాగా, కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపారు. మండలంలోని బండ్లపైకి చెందిన నరేష్ పెయింటింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నెల 3న పనుల కోసం మదనపల్లెకు వెళ్లగా అతడి భార్య గాయత్రి(22) కట్టెలు తీసుకువస్తానని వెళ్లి కనిపించకుండా పోయింది. ఇంటికి వచ్చిన నరేష్ భార్యను వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిమ్మనపల్లె కందూరు రోడ్డుకు చెందిన సయ్యద్‌ఖాన్ భార్య సబీహా ఐదోతేదీ మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లి కుమారుడికి భోజనం క్యారియర్ ఇచ్చి వస్తానని వెళ్లి కనిపించకుండా పోయింది. ఆమె భర్త, కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఆమేరకు కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

పొలం కంచె ధ్వంసం