అంతర్ జిల్లా దొంగల ముఠా పట్టివేత
రాయచోటి: వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ బంగారం, వెండి దోచుకెళ్లిన అంతర్ జిల్లా దొంగల ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు పట్టుకున్నా రు. వారి నుంచి కిలో బంగారం, మూడు కిలోల వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి పోలీ స్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయు డు విలేకరులకు ఆ వివరాలు గురువారం వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా కోయలగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన తోట శివకుమార్ అలియాస్ శివ భవానీ (33) గతంలో విజయవాడ, బందర్, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి గూడెం, హనుమాన్ జంఖ్‌షన్, కోయిలగూడెం, రాజమండ్రి, తుని, అనకాపల్లి, చీపురుపల్లి ప్రాంతాలలో చోరీలకు పాల్పడ్డారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 150 కేసులలో అరెస్టయి జైలు శిక్ష అనుభవించి ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారన్నారు. బయటకు వచ్చిన వెంటనే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మొరవారిపల్లికి చెందిన జెట్టి సుబ్రహ్మణ్యం(27), అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మాధవరం పోడు గ్రామానికి చెందిన సూరేపల్లి వెంకటేష్(21)లతో పరిచయం పెంచుకుని చోరీలు చేయడం మొదలు పెట్టారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రాంతాలలో వీరు దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. వీరిపై బొమ్మూరు, నక్కలపల్లి, తిరుచానూరు పీఎస్‌లలో ఐదు, పీలేరు పీఎస్‌లో రెండు, రాయచోటి అర్బన్, రాజంపేట అర్బన్ పీఎస్‌లలో రెండు, ఓబులవారిపల్లి, మన్నూరు అర్బన్ పీఎస్‌లో 4 కేసులు గతంలో నమోదయ్యాయని అన్నారు. ఊటుకూరు సంజీవరాయ స్వామి దేవాలయం వద్ద ఈ నెల 21న వారిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి కోటి రూపాయలు విలువచేసే కిలో బంగారం, మూడు కిలోల వెండి, రూ.1.40లక్షల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరింత బంగారాన్ని ఫైనాన్స్ కంపెనీ, ఇతర వ్యక్తుల వద్ద రికవరీ చేయాల్సి ఉందన్నారు. కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, మన్నూరు అర్బన్ సీఐ ఎస్.కుళాయప్ప, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎం.చంద్రశేఖర్, ఓబులవారిపల్లి ఎస్‌ఐ పి.మహేష్, సీసీఎస్ ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి, సిబ్బందిని ఎస్పీ విద్యాసాగర్ నాయుడును అభినందించారు.
వివిధ ప్రాంతాల్లో 17 చోట్ల చోరీలు
బంగారు నగలు, వెండి స్వాధీనం
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు


