ఏటీఎస్‌లలోనే వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు
రాయచోటి టౌన్: ఇకపై వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో (ఏటీఎస్) పొందాల్పి ఉంటుందని జిల్లా రవాణా అధికారి ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏటీఎస్ కేంద్రం సర్వే నంబర్ 1064 మాసాపేట, రాయచోటి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచే నిర్వహించుకోవాలని సూచించారు. ఇకపై మ్యానువల్ పద్ధతి ద్వారా ఆర్‌టీవో కార్యాలయంలో వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించరని తెలిపారు. ఈ విషయం వాహనదారులు గమనించాలని కోరారు.
ఏపీ ఈఏపీ సెట్‌కు
2493 మంది హాజరు
కడప ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీ సెట్ ఆన్‌లైన్ పరీక్షలు బుధవారం రెండు సెషన్స్‌లో జరిగాయి. జిల్లావ్యాప్తంగా 2493 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కడపలో ఐదు పరీక్షా కేంద్రాలు, పొద్దుటూరులోని మూడు పరీక్షా కేంద్రాలకుగాను 2621 మంది అభ్యర్థులకుగాను 128 మంది గైర్హాజరయ్యారు. ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్‌కు సంబంధించి 95.12 శాతంగా హాజరు నమోదయింది.
జెడ్పీలో బదిలీలకు
దరఖాస్తుల ఆహ్వానం
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా పరిషత్‌లో సాధారణ బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు నెంబరు 23, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, తేది 15.05.2025 మేరకు ఈనెల 16 నుంచి జూన్ 2వ తేదిలోపు సాధారణ బదిలీలు జరగనున్నాయి. ఒకేచోట ఐదేళ్లు పూర్తయిన ఎంపీడీఓలు, మినిస్ట్రీరియల్, నాల్గవ తరగతి సిబ్బంది అధికారుల అనుమతితో రిక్వెస్ట్ బదిలీ దరఖాస్తులు ఈనెల 25వ తేదీ సాయంత్రం 5.00 గంటల్లోపు జిల్లా పరిషత్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని సీఈఓ ఓబులమ్మ తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఐదేళ్లు సర్వీసు పూర్తయిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. ఏదైనా రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కింద బదిలీ కావాలని కోరుకునే వారు కూడా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. క్రమశిక్షణా చర్యలుగానీ లేదా శాఖాపరమైన చర్యలు ఉన్నవారు బదిలీకి అనర్హులవుతారు. సాధారణ బదిలీలపై వచ్చేనెల 3 నుంచి మళ్లీ నిషేధం అమలులోకి వస్తుంది.
ఆర్‌డీఎస్‌ఎస్ పనుల్లో
వేగం పెంచాలి
కడప కార్పొరేషన్: రివాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం(ఆర్‌డీఎస్‌ఎస్) కింద మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయాలని ఏపీఎస్‌పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్. రమణ ఆదేశించారు. బుధవారం స్థానిక విద్యుత్ భవన్‌లో ఆర్‌డీఎస్‌ఎస్ పథకం కింద జరుగుతున్న పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ ఆర్‌డీఎస్‌ఎస్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో త్రీఫేస్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. ఈ పనులలో వేగవంతం పెంచాలని, తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు త్వరగా లబ్ధి చేకూరటమే కాకుండా విద్యుత్ వ్యవస్థ పటిష్టవంతంగా తయారవుతుందని తెలిపారు.
వెల్ఫేర్ అసిస్టెంట్ సస్పెన్షన్
రాయచోటి: మదనపల్లి మండలం, కోళ్లబైలు–1 గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డి.ద్వారకనాథ్‌నాయుడును జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో లంచం తీసుకొని మోసం చేయడంపై బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి.గతంలో వాల్మీకిపురం మండలం, కుర్పర్తి సచివాలయంలో పనిచేస్తున్న సమయంలో కుర్పర్తి గ్రామానికి చెందిన రెడ్డప్ప, హరీష్‌లకు ప్రధాన మంత్రి యోజన పథకం కింద రూ. 6 లక్షలు రుణం మంజూరు చేయిస్తామని రూ. 30 వేలు వారిద్దరి నుంచి తీసుకొన్నట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో నివేదికను అందజేయాలని మదనపల్లె ఎంపీడీఓను కలెక్టర్ ఆదేశించారు. రెడ్డప్ప, హరీష్‌లు ఆర్జీలో పేర్కొన్న విధంగా సదరు వెల్ఫేర్ అసిస్టెంట్ మోసం చేసినట్లు నిర్ధారణ చేస్తూ మదనపల్లె ఎంపీడీఓ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా సదరు వెల్ఫేర్ అసిస్టెంట్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. సదరు ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్‌లో సస్పెన్షన్‌ను నమోదు చేయాలని మదనపల్లె మండల సహాయ సాంఘిక సంక్షేమ అధికారిణి ఆదేశించారు. ముందస్తు అనుమతి లేనిదే డి.ద్వారకనాథ్ నాయుడు గ్రామాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.


