
గోపవరం ఉప సర్పంచ్ పదవి వైఎస్సార్‌సీపీకే
ప్రొద్దుటూరు రూరల్ : ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో ఆ పదవి వైఎస్సార్‌సీపీకే దక్కింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించారు. సర్పంచ్‌తో పాటు మొత్తం 20 మంది వార్డు మెంబర్లు ఉండగా వైఎస్సార్‌సీపీ తరపున 14 మంది వార్డు మెంబర్లు హాజరయ్యారు. సర్పంచ్ మోషాతోపాటు సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఉపసర్పంచ్‌గా బీరం రాఘవేంద్రారెడ్డికి మద్దతు తెలిపి ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం ఎన్నికల అధికారి రామచంద్రారెడ్డి ఉప సర్పంచ్ ఎన్నిక ధ్రువపత్రాన్ని బీరం రాఘవేంద్రారెడ్డికి అందించారు. డీఎస్పీ భావన ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీకి చెందిన వార్డు మెంబర్లు ఈ ఎన్నికకు గైర్హాజరయ్యారు.
8వ వార్డు అభ్యర్థి వైఎస్సార్‌సీపీకే మద్దతు
వైఎస్సార్‌సీపీ తరపున విజయం సాధించిన 8వ వార్డు మెంబర్ గాయత్రి గతంలో టీడీపీలో చేరారు. మార్చి నెలలో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించినప్పుడు కూడా ఆమె టీడీపీ తరపునే ఉన్నారు. అనూహ్యంగా సోమవారం జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికల్లో గాయత్రి వైఎస్సార్‌సీపీ ఉప సర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేంద్రారెడ్డికి మద్దతు తెలపడం విశేషం.
సంబరాలు
అత్యంత ప్రతిష్టాత్మకంగా సోమవారం జరిగిన ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఒత్తిళ్లకు గురి చేసినా, ప్రలోభాలకు లొంగకుండా వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచిన వార్డు సభ్యులను అందరూ ప్రశంసిస్తున్నారు.