రాయచోటి: ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను పరిష్కరించి వారికి అండగా నిలుద్దామని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని అధికారులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమస్యలను వివరించి పాటి పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. జిల్లా కేంద్రానికి రాలేని వికలాంగులు, ఇతర ప్రజలు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో వినతులు అందిస్తే తదుపరి చర్యలు చేపడతామని ఎస్పీ పేర్కొన్నారు.
నూతన నియామకం
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన పలువురిని పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. స్టేట్‌మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా రాయచోటికి చెందిన షేక్ కరమల హరూన్‌బాషా, స్టేట్ పంచాయతీరాజ్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా రాజంపేటకు చెందిన గాలివీటి వీర నాగిరెడ్డి, స్టేట్ దివ్యాంగుల విభాగం ప్రధాన కార్యదర్శిగా రాజంపేటకు చెందిన దారా సుధాకర్‌లను నియమించారు.
34 మంది పోలీసుల బదిలీ
రాయచోటి : జిల్లాలో 34 మంది పోలీసులకు స్థానచలనం కల్పిస్తూ జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. జిల్లాలో నలుగురు ఏఎస్‌ఐలు, 13 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 17 మంది పోలీసులు స్థానచలనం కల్పించిన వారిలో ఉన్నారు. ఉత్తర్వులు అందుకున్న వారు ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలను చేపట్టాలని ఎస్పీ ఆదేశించినట్లు పోలీసు వర్గాల సమాచారం.
ప్రశాంతంగా ప్రారంభమైన పది సప్లిమెంటరీ పరీక్షలు
రాయచోటి : జిల్లా వ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాల్లో ప్రైవేట్ అభ్యర్థులకు సంబంధించి 1365 మందికి 961 మంది హాజరుకాగా 404 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్‌స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలను పరిశీలించారు. పరీక్ష నిర్వహణపై సిబ్బందికి తగిన సూచనలు, సలహాలను ఇచ్చారు.