
అనుమతొకటి.. తరలించేది మరొకటి..
● తువ్వ మట్టి పేరుతో ఇసుక అక్రమ రవాణా
● టక్కోలు పెన్నా నదిలో జేసీబీ యంత్రాలతో తవ్వకాలు
సిద్దవటం: తువ్వ మట్టి తరలింపునకు అనుమతి పొంది.. ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఉదంతమిది. సిద్దవటం మండలం టక్కోలు గ్రామనికి చెందిన ఒక వ్యక్తి భూమి సాగు కోసం తువ్వ మట్టి తరలింపునకు అనుమతి పొందారు. టక్కోలు సమీపంలోని పెన్నానది నుంచి.. వంద ట్రిప్పుల మట్టికి మండల రెవెన్యూ శాఖ అఽధికారుల నుంచి అనుమతి తెచ్చుకున్నారు. అయితే తువ్వ మట్టి ముసుగులో.. పెన్నా నదిలో జేసీబీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ట్రాక్టర్‌ల ద్వారా కడపకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మంగళవారం పట్టపగలు యథేచ్ఛగా తరలిస్తున్న దృశ్యం స్థానికులకు కనిపించింది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల వారు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఇదిలా ఉండగా గృహ నిర్మాణాల అవసరాలకే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక తరలింపునకు అనుమతి ఇవ్వగా.. కొంత మంది కడపకు అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాగే జరిగితే పెన్నా నదికి వరదలు సంభవించినప్పుడు తమ భూములు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.