
నిధుల రైలు వచ్చేసింది
రాజంపేట : 2025–2026 బడ్జెట్ నుంచి విడదులైన నిధుల రైలు ఎట్టకేలకు వచ్చేసింది..బడ్జెట్ నిధుల కేటాయింపులకు సంబంధించి పింక్ బుక్ (కీ బడ్జెట్ డేటా)ఆలస్యంగా విడుదలైంది. దీనిని పరిశీలిస్తే బడ్జెట్‌లో ఉభయ వైఎస్సార్ జల్లాకు పెద్దగా ఒరిగిందేమిలేదు. కొత్తలైన్లు, కొత్తరైళ్లు లేవు. పాడిందేపాటరా అన్న సామెత ఇప్పుడు విడుదలైన నిధులకు సరిగ్గా సరిపోతుందని రైల్వే నిపుణులు భావిస్తున్నారు .
● 255.4కిలోమీటర్ల దూరం కలిగిన కడప–బెంగళూరు రైల్వేలైన్ 2014లో ప్రారంభమైంది. యూపీఏ ప్రభుత్వంలో మంజూరైన రైలుమార్గానికి వ్యయం రూ.20వేలకోట్లు అంచనా వేశారు .2016–2017లో రూ.58కోట్లు, 2017–2018లో రూ.240కోట్లు. 2018–2019లో రూ.175 కోట్లు, 2022–2023లో రూ.289 కోట్లు– 2023–2024లో రూ.10లక్షలు, 2025–2026లో ఈబీఆర్(ఎస్) కింద రూ.21లక్షలు కేటాయింపులు జరిగాయి. కడప–బెంగళూరు రైల్వేలైన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందన ఆశాజనకంగా లేదనేది నిధుల కేటాయింపులను బట్టి తెలుస్తోంది. అందువల్ల పనులు వేగం అందుకోలేకపోతున్నాయి. 14 ఏళ్లవుతున్నా ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రైల్వేలైన్‌కు రూ.185 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. గత టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర నిధులు కేటాయించలేదు.
ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులకు
126 కిలోమీటర్ల దూరం కలిగిన ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గానికి ఈబీఆర్(ఎస్) కింద రూ.30.15 కోట్లు కేటాయించారు. 113 కిలోమీటర్ల దూరం కలిగిన కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైలుమార్గానికి డిపాజిట్(ఆర్‌వీఎన్) కింద 267 కోట్ల వ్యయం చేస్తున్నారు.
● 2020లో బడ్జెట్‌లో ముద్దనూరు–ముదిగుబ్బ అనే కొత్త లైన్ తెరపైకి రావడంతో పులివెందులకు రైలుకూత వినిపించేందుకు ఆశలు అప్పట్లో రేకేత్తించాయి. ఈ సారి బడ్జెట్‌లో 65 కిలోమీటర్ల దూరం ఉన్న ముద్దనూరు–ముదిగుబ్బ కొత్తలైన్ ఆర్‌ఈటీ సర్వే కింద రూ.16లక్షలు కేటాయించారు.
● 110 కిలో మీటర్ల దూరం ఉన్న ముద్దనూరు–పులివెందుల–శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం లైన్‌కు రూ.2 కోట్లు ఫైనల్ లొకేషన్ సర్వేకు కేటాయించారు. రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగిన నియోజకవర్గ కేంద్రమైన పులివెందులలో రైలుకూత కోసం ఎన్నో ఏళ్లుగా అక్కడి వాసులు ఎదురుచూస్తున్నారు. తమ ప్రాంత మీదుగా రైలుమార్గం వెళితే రైలుకూత వినివచ్చునన్న భావనలో ఉన్నారు.
మొక్కుబడిగా నిధుల కేటాయింపు
ఎన్‌డీఏ, యూపీఏ ప్రభుత్వలో తెరపైకి వచ్చిన కొత్త లైన్ల సర్వేలకు ప్రతి బడ్జెట్‌లో మొక్కుబడిగా నిధులు కేటాయింపులు జరిగాయి. కంభం–ప్రొద్దుటూరు లైన్(142కి.మీ) రూ.10లక్షలు డిపాజిట్ చేశారు. సర్వేకు పరిమితమైన భాకారాపేట–గిద్దలూరు లైన్‌ను గాలికి వదిలేశారు.
గుంతకల్–రేణిగుంటలైన్‌లో 3, 4 లైన్‌కు సర్వే
గుంతకల్–రేణిగుంట మధ్య 3, 4 లైన్ నిర్మాణానికి రైల్వేబోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా బడ్జెట్‌లో సర్వేకు ఉపక్రమించింది. ఫైనల్ లోకేషన్ సర్వే కింద గుంతకల్–ఓబులవారిపల్లెకు(256 కి.మీ) రూ.5 కోట్ల కేటాయింపులు జరిగాయి. 56 కిలోమీటర్ల దూరం ఉన్న ఓబలవారిపల్లె– రేణిగుంటకు ఫైనల్ లోకేషన్ సర్వే కోసం రూ.1 కోటి వ్యయం చేయనుంది. ప్రస్తుతం డబుల్‌లైనులో రైళ్లు నడుస్తున్నాయి. 3,4 లైన్ల నిర్మాణం సకాలంలో పూర్తయితే రైళ్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.
కడప రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు
నిధుల కేటాయిపు
ఉభయవైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు రూ.18 కోట్ల కేటాయింపులు జరిగాయి. పార్శిల్ ఆఫీసు ఆధునికీకరణ చేయనున్నారు. ఓపెన్ వెయిటింగ్ హాల్‌తోపాటు , రూ.4 కోట్లతో ఎస్కలేటర్స్ సౌకర్యం కోసం బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. అప్‌గ్రేడ్‌స్టేషన్ కింద పీలేరు, రాజంపేటలో స్టేషన్ అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు జరిగాయి. గుత్తి–పుల్లంపేట రూ.18కోట్లతో 29 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్‌సిస్టమ్ బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టారు.
ప్లాట్‌ఫాంల పొడిగింపు...
గుంతకల్–రేణిగుంట మార్గంలో ప్లాట్‌ఫాంలను పొడిగించనున్నారు. రూ.3 కోట్లతో 24/26/ఎల్‌హెచ్‌బీ బోగీలకు అనుకూలంగా రాజంపేట, కోడూరు స్టేషన్లలో నిర్మితం చేయనున్నారు. ఇదే విధంగా ముద్దనూరులో రూ.3 కోట్లతో ప్లాట్‌ఫాం అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
గూడ్స్‌షెడ్ల అభివృద్ధి
రైల్వేకోడూరులో గూడ్స్‌షెడ్‌ను రూ.11 కోట్లతో, ముద్దనూరు గూడ్స్‌షెడ్ రూ.13 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. శెట్టిగుంట, రాజంపేటలో ట్రాక్‌మిషన్ సైడింగ్స్,రెస్ట్‌రూం తదితర సౌకర్యాల కోసం రూ.5 కోట్లు కేటాయించారు. రాజంపేట యార్డులోని సబ్‌వేకు రూ.5 కోట్ల కేటాయింపులు జరిగాయి.
కడప–బెంగళూరు లైన్‌కు స్వల్పనిధులు
రేణిగుంట–గుంతకల్ 3,4లైన్‌కు సర్వే

నిధుల రైలు వచ్చేసింది