నిరంకుశత్వం, కక్ష సాధింపే కూటమి ప్రభుత్వ లక్ష్యం
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో నిరంకుశత్వం, కక్ష సాధింపే లక్ష్యంగా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి లక్ష్యంగా వారిపై కేసులు పెట్టేందుకు గత ప్రభుత్వం నిర్వహించిన మద్యం పాలసీని సాకుగా చూపుతున్నారన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా సంబంధం లేని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహరెడ్డి, బాలాజీ, రాజ్‌కసిరెడ్డిలను అరెస్టు చేసి వారివద్ద బలవంతపు వాంగ్మూలాలు తీసుకొంటున్నారని ఆరోపించారు. సీఐడీని పావుగా వాడుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి సిండికేట్‌గా మారి విచ్చల విడిగా బెల్ట్ షాపుల ద్వారా దోచుకొంటున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ప్రభుత్వం ద్వారానే నిర్వహించి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చామన్నారు. ఇవేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు చూస్తే ఆటవిక, అరాచక పాలన నడుస్తోందని అర్థమవుతోందన్నారు. కొత్త పథకాలు ఇవ్వక పోగా ఉన్న పథకాలు ఆపేసి దోపిడీలు, దౌర్జన్యాలకు తెరలేపారని ధ్వజమెత్తారు. వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, సీహెచ్ రమేష్, జిల్లా యువజన అధ్యక్షుడు శివారెడ్డి, మందల నాగేంద్ర, తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, బండారుమల్లి, డీవీరమణ, దామర్ల సిద్దయ్య, వెంకటరెడ్డి, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి,
మాజీ ఎమ్మెల్యే కొరముట్ల


