జాతీయ రహదారి పనుల పూర్తికి చర్యలు
లక్కిరెడ్డిపల్లి: రాయచోటి– చాగలమర్రి జాతీయ రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని లక్కిరెడ్డిపల్లి ఎంపీడీఓ సభా భవనంలో రహదారి విస్తరణలో ఇంటిస్థలాలు, ఇళ్లు కోల్పోతున్న లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ ఆదర్శ రాజేంద్రన్ మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇంటిస్థలాలు, ఇంటి పట్టాలు, ఇళ్లుకు సంబంధించిన నష్టపరిహారాన్ని ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేసిందన్నారు. చాలా మందికి నష్టపరిహారం కింద వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసినట్లు చెప్పారు. ఇంకా పరిహారం అందనివారు కలెక్టర్‌కు విన్నవించుకొని పరిష్కారం చేసుకోవాలన్నారు. వచ్చేనెల 10వ తేదీలోపు జాతీయ రహదారి విస్తరణలో ఉన్న ఇళ్లు, ఇళ్లస్థలాలు ప్రభుత్వం రోడ్డు విస్తరణ నియమించిన మార్కు వరకు తొలగించనున్నట్లు తెలిపారు. అనంతరం లబ్ధిదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఇన్‌చార్జి ఎంపీడీఓ ఉషారాణి, మండల సర్వేయర్ మధుసూదన్‌రెడ్డి, ఆర్‌ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
జేసీ ఆదర్శ రాజేంద్రన్


