వారసులకు అన్యాయమే.. | - | Sakshi
Sakshi News home page

వారసులకు అన్యాయమే..

May 14 2025 12:46 AM | Updated on May 14 2025 12:46 AM

వారసు

వారసులకు అన్యాయమే..

రాయచోటి : రాయచోటిలోనే కాదు రాయలసీమలోనూ సుగవాసి పాలకొండ్రాయుడు లేని టీడీపీని ఊహించుకోవడం కష్టం. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆ పార్టీతో ఆయనకున్న అనుబంధం.. పార్టీ అధిష్టానంతో పెంచుకున్న బంధం.. ఆయన అనుయాయులు, అనుచర వర్గం, సామాజిక వర్గీయులతో పెనవేసుకున్న బంధం అలాంటిది. అలాంటి సుగవాసి పాలకొండ్రాయుడు మరణం సమయంలో పార్టీ పెద్దలు చూపిన చిన్నచూపు అందరినీ ఆశ్చర్య చెకితులను చేసింది. పాలకొండ్రాయుడు పట్ల టీడీపీ అధిష్టాన వైఖరిపై రాయుడు అనుయాయులు, తెలుగు తమ్ముళ్ల అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల పాటు టీడీపీ జెండా మోసిన నేతకు నివాళులు అర్పించే టైం పార్టీ అధినేతకు లేదా అంటూ రగిలిపోయారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీకి సేవలు అందించిన నిజమైన నాయకుడు పాలకొండ్రాయుడుకు పార్టీ అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నిలదీస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి తిరుగులేని రాయచోటిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన పాలకొండ్రాయుడును టీడీపీని స్థాపించిన ఎన్‌టీఆర్‌ పిలిస్తే టీడీపీలోకి వెళ్లారనేది అందరికీ తెలిసిన సత్యం. 1983 ఎన్‌టీఆర్‌ సునామీలో కూడా ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా రాయచోటి ఎమ్మెల్యేగా సుగవాసి గెలుపొందారు. రాజంపేట పార్లమెంట్‌కు అభ్యర్థి దొరకని పరిస్థితులలో టీడీపీ అధ్యక్షులు ఎన్‌టీఆర్‌ కోరితే పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి టీడీపీ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఎన్‌టీఆర్‌ అనంతరం పార్టీ అధినేతగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు వెంట నడిచారు. టీడీపీకి స్థానం లేదనుకున్న రాయచోటిలో ఎంపీతో పాటు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చూపించారని పేర్కొంటున్నారు. పార్టీ కష్టాలలో సైతం అధినేతకు అండగా నిలిచి రాయచోటిలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా తన సామాజికవర్గాన్ని బలపరుస్తూ తిరుగులేని నేతగా కూడా కొనసాగారు. అలాంటి నాయకుడు చనిపోయిన సందర్భంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లేదా ఆయన తనయుడు లోకేష్‌బాబు కానీ పరామర్శకు రాకపోవడం పట్ల సుగవాసి కుటుంబానికి పార్టీలో ఉన్న స్థానాన్ని బయట పెట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సిండికేట్‌ వాటా ఘర్షణలో చనిపోతే..

ఎవరో.. ఇద్దరు టీడీపీ నేతలు మద్యం సిండికేట్‌లో వాటాల కోసం కొట్టుకు చనిపోతే చంద్రబాబు వెళ్లారు.. నిశ్చయ తాంబూలాలు, పెండ్లిళ్లు, పుట్టినరోజుల వేడుకలకు సైతం హాజరవుతున్న బాబు తనతో కలిసి 40 సంవత్సరాల పాటు ప్రయాణం సాగించిన సహచరుని చివరి చూపుగా నివాళులు అర్పించడానికి కూడా రాకపోవడం ఎంత వరకు సమంజసమంటూ.. సోషల్‌ మీడియా, యూట్యూబ్‌, వాట్సాప్‌, ఇన్‌స్ట్రాగామ్‌ వేదికలుగా సుగవాసి అనుయాయులు ప్రచారం చేస్తున్నారు. నారా లోకేష్‌ పక్కనే ఉన్న సత్యవేడుకు వచ్చి వెళ్లారు తప్ప.. రాయచోటికి వచ్చి... సుగవాసి పాలకొండ్రాయుడుకు నివాళులు అర్పించి ఉంటే ఎంత బాగుండేది? అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదేనా.. పెద్దాయనకు మీరు ఇచ్చే నివాళులు? మర్యాద? అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

సోషల్‌ మీడియా వేదికగా..

పార్టీ కష్ట నష్టాలలో ముందుంటూ నడిపిస్తూ వచ్చిన పాలకొండ్రాయుడుకు ఆయన చివరి అంకంలో జరిగిన ఘోర అవమానంపై సోషల్‌ మీడియా వేదికగా ఆయన అనుయాయులు, అనుచర వర్గం టీడీపీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పేరుతో ఉన్న సోషల్‌ మీడియాలో కనీసం ఒక పోస్ట్‌ పెట్టి శ్రద్ధాంజలి ఘటించలేదంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. నోట్ల కట్టలకు, పదవులకు పబ్లిక్‌గా అమ్ముడుపోయే నాయకులున్న ఈ కాలంలో బతికున్నని రోజులు పసుపు కండువా మోసాడంటూ రాయుడు సేవలను కీర్తిస్తున్నారు. 80 సంవత్సరాల వయసులో 45 డిగ్రీల ఎండను సైతం లెక్కచేయకుండా రాయచోటిలో టీడీపీని గెలిపించేందుకు ఆయన చేసిన ప్రచారాలను వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లలో పెడుతూ టీడీపీ అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కనీసం పార్టీ అఫీసియల్‌ సోషల్‌ మీడియా ద్వారా శ్రద్ధాంజలి ఘటించకపోవడం దారుణమంటూ మండిపడుతున్నారు.

పాలకొండ్రాయుడి కుటుంబాన్ని

విస్మరించిన టీడీపీ అధిష్టానం

చనిపోయిన సందర్భంలోనూ

రాని పార్టీ అధినేతలు

కార్పొరేషన్‌ పదవుల్లోనూ మొండిచేయి

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినా దక్కని సముచిత స్థానం

సోషల్‌ మీడియా, యూట్యూబ్‌, వాట్సాప్‌ల వేదికగా రగిలిపోతున్న సుగవాసి అనుచర వర్గం

తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు కష్టపడ్డ సుగవాసి వారసులుగా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన తనయుడు సుగవాసి బాలసుబ్రమణ్యంకు పార్టీ నుంచి ఆశించిన మేర స్థానం లభించలేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో రాయచోటి స్థానాన్ని ఆశించి భంగపాటుకు గురైన సుగవాసి కుటుంబానికి చివరి నిమిషంలో రాజంపేట స్థానాన్ని కేటాయించారు. అన్నమయ్య జిల్లాలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా బలిజ సామాజికవర్గ ఓట్లను దూరం కానివ్వకుండా చేసేందుకు తక్కువ సమయంలో రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. ఆ ఎన్నికల్లో సుగవాసి బాలసుబ్రమణ్యం పోటీ చేసినా సొంత పార్టీ నాయకులు వెన్నుపోటు పొడవడంతో ఓటమి పాలయ్యారు. రెండు రోజుల కిందట పార్టీ అధిష్టానం ప్రకటించిన రాష్ట్ర కార్పొరేషన్ల పదవులలోనూ సుగవాసి కుటుంబానికి మొండిచేయి చూపించింది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌ లను పాలకొండ్రాయుడుతో పాటు ఆయన తనయుడు బాలసుబ్రమణ్యం, ప్రసాద్‌బాబులు పలుమార్లు కలిసినా తగిన ప్రాధాన్యత లేకుండా పోయిందన్న వేదన, అక్కసు ఆ పార్టీ నాయకులు, సుగవాసి వర్గీయులలో నిగూఢంగా ఉంది. ఇప్పటికే కూటమి పాలనపై రగిలిపోతున్న టీడీపీ వర్గీయులకు సుగవాసికి లభించని ప్రాధాన్యతతో వారి ఆవేశం సోషల్‌ మీడియా వేదికగా నిప్పులు కక్కుతోంది.

వారసులకు అన్యాయమే.. 
1
1/1

వారసులకు అన్యాయమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement