విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

Feb 13 2025 9:08 AM | Updated on Feb 13 2025 9:07 AM

మదనపల్లె: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే, రెవెన్యూ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ అన్నారు. బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ మేఘ స్వరూప్‌ తో కలిసి, మండలంలోని పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్‌ 6 నుంచి జనవరి 8 వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భాగంగా మండలంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో తీసుకున్న చర్యలపై తహసీల్దార్‌ ధనుంజయలును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..నాణ్యతే ప్రామాణికంగా పీజీఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో జిల్లా వ్యాప్తంగా పీజీఆర్‌ఎస్‌లో 11వేల దరఖాస్తులు అందగా, ఇప్పటివరకు 5వేల దరఖాస్తులను పరిష్కరించామన్నారు. పీజీఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారంలో మదనపల్లి మండలం బాగా వెనకబడిందని కలెక్టర్‌ అన్నారు. రెవెన్యూ సదస్సులో భాగంగా.. మదనపల్లి మండలంలో సర్వేతో కలిపి మొత్తంగా 1361 దరఖాస్తులు వచ్చాయి. అయితే గత 60 రోజుల్లో కేవలం 285 దరఖాస్తులు, అంటే 20శాతం మాత్రమే రెవెన్యూ సిబ్బంది పరిష్కరించారన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో కొత్తపల్లె, వేంపల్లె, పోతబోలు వీఆర్వోలు మంచి పనితీరు కనపరిచారన్నారు. కోళ్ల బైలు, పొన్నుటి పాలెం, వెంకప్ప కోట, కోటవారిపల్లి, బికేపల్లి, మాలెపాడు వీఆర్వోలు వెనుకబడి ఉన్నారన్నారు. దాదాపు రెండు నెలల సమయం ఉన్నా కూడా అతి తక్కువ ప్రగతి సాధించారన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో వెనుకబడిన వీఆర్వోలను మండలంలోని ఇతర ప్రాంతాలకు పంపుతామన్నారు. అక్కడ కూడా సరైన పనితీరు కనపరచకపోతే ఇతర మండలాలకు బదిలీ చేస్తామన్నారు. మండలంలో ప్రభుత్వ భూములను ఎక్కడైనా ఆక్రమణ జరిగినట్లు గుర్తిస్తే వెంటనే తొలగించి స్వాధీనం చేసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా ప్రభుత్వ భూములకు వాటికి రక్షణ కల్పించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. అనంతరం వివిధ అంశాలలో తగు సూచనలు జారీ చేశారు.

రెవెన్యూ సమస్యలపై వేగంగా స్పందించాలి

కురబలకోట: వివిధ రెవెన్యూ సమస్యలపై వేగంగా స్పందించాలని జిల్లా కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ పేర్కొన్నారు. కురబలకోట తహసీల్దారు కార్యాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్సించారు. ఈ సందర్భంగా డిసెంబర్‌ 6 నుంచి జనవరి 8 వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల అర్జీల ప్రగతిపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో అందిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి వెంటనే పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో వేగం నాణ్యత రెండూ ముఖ్యమేనన్నారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించి వాటిని యుద్ధప్రాతిపదికన తొలగించాలన్నారు. తహసీల్దారు తపస్విని, ఎంఆర్‌ఐ బాలసుబ్రమణ్యం,సర్వేయర్‌ భువనేశ్వరి, వీఆర్వోలు, విలేజ్‌ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement