శుభాల తోరణం.. రంజాన్‌ మాసం | - | Sakshi
Sakshi News home page

శుభాల తోరణం.. రంజాన్‌ మాసం

Apr 1 2024 1:30 AM | Updated on Apr 1 2024 4:57 PM

జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని మసీదు - Sakshi

జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని మసీదు

రాజంపేట : రంజాన్‌ మాసం ఆధ్యాత్మిక మాసంగా కొనసాగుతోంది. ఈ మాసం ముస్లింలకు అత్యంత పవ్రితమైనది. ఈ మాసంలో వారు చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం ఎన్నో రేట్ల ఫలితాలను అందిస్తుందనేది వారి విశ్వాసం. ఆకాశంలో నెలవంక కనిపించడంతో మాసం ఆరంభమవుతుంది. మార్చి 12 నుంచి రంజాన్‌ ఉపవాసదీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా జిల్లాలోని రాయచోటి, మదనపల్లె, రైల్వేకోడూరు, రాజంపేట, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో ముస్లింలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రంజాన్‌ పరమ పవిత్రం

రంజాన్‌ మాసం భూమిపై ఖురాన్‌ అవతరించిన నెలగా ఇస్లాం గ్రంథాలు చెబుతున్నాయి. ముస్లింలు ఉపవాస దీక్షలో పాల్గొంటారు. ఈ నెలలో సఫిల్‌ చదివితే ఫరజ్‌ చదివినంతగా అంటే 70 సార్లు నమాజ్‌ చేసిన పుణ్యం వస్తుందని ఇస్లాం గ్రంథాలు ప్రభోదిస్తున్నాయి. తాక్‌రాత్‌ రోజులకు ప్రత్యేకత ఉంది. ఈ నెల రోజులు ఉపవాసదీక్షలు చేపట్టి అభాగ్యులకు దానాలు చేస్తూ ఇతోధిక సాయాన్ని ముస్లింలు అందిస్తారు. ఈ కఠోర దీక్షల ద్వారా ప్రతి ముస్లిం వ్యక్తిగత క్రమశిక్షణతోపాటు చెడు ఆలోచనలు, చెడుపనుల నుంచి తనను తాను నియంత్రించుకుంటాడు.

దానధర్మాలకు ప్రాధాన్యత

రంజాన్‌మాసంలో ముస్లింలు దానధర్మాల (జకాత్‌, ఫిత్రా)కు అత్యధిక ప్రాధాన్యమిస్తారు. ప్రతి ముస్లిం ఫిత్రా (నిర్ణీతదానం) తప్పనసరిగా చేయాలి. ఏటా ఫిత్రా రుసుంను నిర్ణయిస్తారు. కుటుంబంలోని సభ్యులందరూ అప్పుడే పుట్టిన పసికందుతో సహా ఫిత్రా ప్రకారం దానం చేయాలి.

మసీదులలో ప్రార్థనలు

రోజా పాటించే సమయంలో ముస్లింలు తప్పనిసరిగా నమాజ్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపవాసదీక్షలో ఐదుపూటల నమాజ్‌ చేస్తారు. దీనికి అదనంగా దీక్షల మాసమంతా ‘తరావిస్‌’ నమాజ్‌ను కూడా భక్తిశ్రద్ధలతో ఆచరించడం రంజాన్‌ ప్రత్యేకత. రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి పది గంటల వరకూ సాగే తరావీహ్‌ నమాజ్‌లో ఖురాన్‌ పఠనం చేస్తారు. నిత్యం అల్లా నామస్మరణలతో ముస్లింలు గడుపుతారు.

హలీం రుచులు ప్రత్యేకం

రంజాన్‌మాసంలో లభించే ఒక ప్రత్యేక వంటకం హలీం. కొన్నేళ్ల వరకూ కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన హలీం ఇప్పుడు జిల్లా కేంద్రం, పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాలు, మండలాల వరకు వచ్చేసింది. హలీం తయారీలో పలురకాల బలవర్ధకమైన ద్రవ్యాలతోపాటు పలు సుగంధ ద్రవ్యాలను వినియోగిస్తారు. వీటితోపాటు గోధుమ, మాంసం హలీం తయారీకి ప్రధాన ముడిసరుకులు. మిశ్రమాన్ని రాగి పాత్రలో సుమారు ఎనిమిది గంటల పాటు ఉడికిస్తారు. హలీంకు త్వరగా జీర్ణమయ్యే గుణం ఉండటం వల్ల రోజంతా ఉపవాస దీక్షలో ఉండే ముస్లింలు దీక్ష అనంతరం దీనిని ఎక్కువగా తీసుకుంటారు. వేడివేడిగా ఉన్నప్పుడే హలీం రుచి ఆస్వాదించాలని వ్యాపారులు చెబుతున్నారు.

మసీదుల్లో సందడి

రంజాన్‌ మాసం వచ్చిదంటే మసీదులన్నీ కిటకిటలాడుతుంటాయి. మసీదులో రంజాన్‌ మాసంలో ఇఫ్తార్‌ విందులతోపాటు సహర్‌ విందులు కూడా జరుగుతుంటాయి. జిల్లాలో వేల సంవత్సరాలు నుంచి ఉన్న మసీదులు ఉన్నాయి. తాజాగా నిర్మించిన మసీదులు ఉన్నాయి. వీటిలో వందల సంఖ్యలో ముస్లింలు రోజూ ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. అదే శుక్రవారాల్లో అయితే ఆ సంఖ్య మరింత పెరిగిపోతుంది.

ప్రత్యేక నమాజ్‌లలో ముస్లింలు

భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు

రంజాన్‌ దీక్షలతో అమోఘమైన ఫలితం

రంజాన్‌ మాసం ముస్లింలకు అమోఘమైన ఫలితాన్ని ఇవ్వడానికి అల్లా ప్రసాదించిన అద్భుతమైన వరం. మానవులను సంస్కరించి వారిని దైవానికి చేరువగా తీసుకెళ్లే మార్గంను రంజాన్‌ చూపిస్తుంది. మానవులు ఏ విధంగా నడుచుకోవాలి. దైవం పట్ల, సమాజం పట్ల ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించాలనే అంశాలను కూడా రంజాన్‌మాసం తెలియచేస్తుంది. అందుకే రంజాన్‌ మాసం మానవాళికి సర్వశుభాలను చేకూర్చే మాసం.

–సయ్యద్‌సాహెబ్‌, వ్యాపారి, నందలూరు

ఆకలిదప్పికలను తెలుసుకోవాలని చెబుతుంది

సమాజంలోని పేదల ఆకలిదప్పికలను తెలుసుకొని వారికి అండగా ఉండాలని రంజాన్‌ మాసం చెబుతుంది. మానవులు వారి తప్పులను సంస్కరించుకొని ఉన్నత జీవితాన్ని గడిపేందుకు, సమాజంలో పేదలకు అండగా ఉండే విధంగా నడుచుకునేందుకు అల్లా రంజాన్‌ మాసంలో ఉపవాసదీక్షలను నిర్దేశించారు. తోటి మానవులు సుఖంగా ఉండేందుకు ఏ విధంగా నడుచుకోవాలో రంజాన్‌ మాసం ఉపదేశిస్తుంది.

– సయ్యద్‌అమీర్‌, జిల్లా సెక్రటరీ, వక్ఫ్‌బోర్డు,

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement