ఏపీవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసనలు | Ysrcp Leaders Protests Across Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసనలు

Apr 4 2026 9:57 AM | Updated on Apr 4 2026 5:54 PM

Ysrcp Leaders Protests Across Andhra Pradesh

సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్  చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసనలు చేపట్టింది. వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నేతలు.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నిరసనలు చేపట్టారు. బీఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చినా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవటంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం  చేశారు.

ఇప్పటికీ బీఆర్ నాయుడిని వెనకేసుకువస్తున్న చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ప్రపంచవ్యాప్త హిందూ భక్తులు, నెటిజన్ల విమర్శలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది.

వైఎస్సార్ జిల్లా: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై పులివెందులలో  వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో 101 టెంకాయలు కొట్టి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నాడని ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు.

బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్ చేశారు. ఈ నిరసన మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, పట్టణ అధ్యక్షుడు హల్ గంగాధర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొన్నాయి.

అనంతపురం జిల్లా: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలని కోరుతూ అనంతపురంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నేతలు ఆందోళన నిర్వహించారు. అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్లకార్డులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ మండిపడ్డారు.

విశాఖపట్నం: టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్  చేసింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని వెంటేశ్వరస్వామి వారి ఆలయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించాయి. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మొల్లి అప్పారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు రమణకుమారి, మాజీ మేయర్ హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ: సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. బీఆర్‌ నాయుడిని టీటీడీ ఛైర్మన్ పదవి నుండి తొలగించాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. పూజల్లో మాజీ ఎమ్మెల్యే, మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ నాయుడిని టీడీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. టీటీడీ పవిత్రతను కాపాడాలంటూ నినాదాలు చేశారు.

BR నాయుడు రాజీనామా చేయడం లేదా..? చంద్రబాబు చెప్పడం లేదా..

చంద్రబాబు సమాధానం చెప్పాలి: మల్లాది విష్ణు
బీఆర్ నాయుడు ఛైర్మన్ అయిన రోజు నుంచి తిరుమలపై అపచారాలు జరుగుతున్నాయి. టీడీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి. ఏమొహం పెట్టుకుని చంద్రబాబు బీఆర్ నాయుడిని తన పక్కన కూర్చోబెట్టుకుని తిరుపతిలో పూజలు చేస్తారు. కళంకితమైన వ్యక్తితో కలిసి ఎలా ఒంటిమిట్ట రాముల వారి కళ్యాణంలో పాల్గొంటారు. అసలు చంద్రబాబుకు నైతికత ఉందా?. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్‌గా తీసుకోవద్దని ఓ మహిళ లేఖ రాసింది. కానీ అవేమీ చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. హిందూ ధర్మానికి, హిందూ సమాజానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.

పటమట వెంకటేశ్వరస్వామి ఆలయంలో..
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు  నిర్వహించారు. పటమట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కల్పలత, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పూజలు చేశారు.

తిరుపతి: టీటీడీ చైర్మన్ వైఖరి పట్ల హిందూ సమాజం సిగ్గు పడుతోందని తిరుపతి వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి భూమన అభినయ్‌రెడ్డి అన్నారు. శ్రీవారి ప్రథమ సేవకుడిగా ఉంటూ.. ఆయన చరిత్ర ఇంత పరమ నికృష్ట మైందా అని ముక్కున వేలేసుకుంటున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలి. లైంగిక ఆరోపణలు వచ్చిన తర్వాత తిరుమల సీఎం చంద్రబాబు మనవడు పుట్టినరోజు వేడుకల్లో  పాల్గొనడం, శ్రీరామ నవమి వేడుకల్లో సీఎం తో పాటు టీటీడీ చైర్మన్ పాల్గొనడం సిగ్గుచేటు.

చిత్తూరు జిల్లా: టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలని జీడి నెల్లూరు నియోజకవర్గం  వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ కృపాలక్ష్మీ డిమాండ్ చేశారు.  కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఆమె మాట్లాడుతూ..  ‘ బీఆర్‌ నాయుడు రాసలీలలు బయట పడిన తర్వాత కూడా  టీటీడీ చైర్మన్ గా కొనసాగించడం సిగ్గు చేటు. సీఎం చంద్రబాబు వెంటనే బీఆర్‌ నాయుడిని తొలగించాలి. 

కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు.. హోంశాఖామంత్రి అనిత మహిళలకు అండగా  ఉన్నామని అంటున్నారే కానీ నడిరోడ్డుపై మహిళను పదవిలో ఉన్న ఎమ్మెల్యే కొడుతుంటే ఎలాంటి స్పందన లేదు. హోం శాఖ మంత్రి విమర్శలకే పరిమితమైంది. పల్నాడు జిల్లా, మాచర్లలో ఇంట్లో వున్న మహిళను కాళ్లు చేతులు కట్టేసి బలవంతంగా అఘాత్యానికి పాల్పడిన ఘటనపై బాధ్యత మహిళలకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దిశ యాప్ ద్వారా మహిళలకు అండగా నిలిచాము’ అని స్పష్టం చేశారు. 

నెల్లూరు జిల్లా:   బీఆర్‌ నాయుడు టీటీడీ  చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణితో కలిసి వెంకటేశ్వర స్వామి వారికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత.

  • స్త్రీలోలుడు బి.ఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి
  • బీఆర్‌ నాయుడు   తన పదవికి రాజీనామా చేయకుండా కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు
  • చంద్రబాబు కు భక్తుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, బీఆర్‌ నాయుడిని తొలగించాలి
    - కాకాణి పూజిత
     

నెల్లూరు జిల్లా, బీఆర్‌ నాయుడు  టీటీడీ చైర్మన్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం కేంద్రంలోని శ్రీలక్ష్మి  గోదా సమేత  వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్థన్‌రెడ్డి.

ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ శ్రేణులు, భక్తులు  పాల్గొన్నారు. 

మాజీ మంత్రి కాకాణికి వేదమంత్రాల నడుమ, మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికిన, ఆలయ అర్చకులు, స్థానికులు

కాకాణి కామెంట్స్‌

  • నైతిక విలువలు లేని  బీఆర్‌ నాయుడికి  పవిత్ర పదవి ఇవ్వడం సరికాదు

  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి, అనైతిక కార్యక్రమాలు పెచ్చరిల్లిపోయాయి

  • చంద్రబాబు మహిళల పై ఎవరైనా చెయ్యి వేస్తే, అదే ఆఖరి రోజు అవుతుందని చెబుతూనే ఉన్నాడు

  • -మా ప్రభుత్వం వస్తే మహిళల వైపు చూడడానికే భయపడతారని పవన్ కళ్యాణ్ ప్రగల్బాలు పలికాడు

  • ఇప్పుడు ఇన్నీ అరాచకాలు జరుగుతున్నా నోరు మెదపరేమి

  •  వైఎస్‌ జగన్‌ పాలనలోనే మహిళలు రక్షణ పొందారు
     

పార్వతీపురం, మన్యం జిల్లా: టీటీడీ చైర్మన్‌ పదవిని బీఆర్‌ నాయుడు అపవిత్రం చేశారంటూ  మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ధ్వజం.  బీఆర్‌ నాయుడు వెంటనే టీటీడీ చైర్మన్‌ పదవి నుంచి దిగిపోవాల్సిందేనంటూ డిమాండ్‌

గుంటూరు: బీఆర్‌ నాయుడు పదవి నుంచి దిగిపోవాల్సిందే: అంబటి రాంబాబు
వెంకటేశ్వరస్వామి ఆలయంలో అంబటి ప్రత్యేక పూజలు
 

Advertisement
 
Advertisement
Advertisement