
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(సోమవారం) పులివెందులలో పర్యటించనున్నారు.
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(సోమవారం) పులివెందులలో పర్యటించనున్నారు. లింగాలలో పడిపోయిన అరటి తోటలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. భారీవర్షాలు, ఈదురు గాలులకు అరటి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. బాధిత రైతులను ఆయన పరామర్శించనున్నారు.
వైఎస్సార్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానకు భారీగా అరటి పంటలు నేలకూలాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని కోమనంతల, వెలిగండ్ల, పార్నపల్లి, లింగాల గ్రామాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో సరిగ్గా కోతకు వచ్చిన సమయంలో భారీ పంట నష్టం ఏర్పడింది. చేతి కందిన పంట నేలకూలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.