జగన్ మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్రవ్యాప్తంగా సంచలన చర్చ
అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన అంటున్న రాష్ట్ర ప్రజానీకం
అమరావతితో పోలిస్తే కేవలం 10శాతం వ్యయంతో రాజధాని కల సాకారం
అదే అమరావతి అయితే రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీటివసతికే రూ. 2 లక్షల కోట్లు
రోడ్లకే దశాబ్దాలు పడితే ఇక రాజధాని నిర్మాణం సాధ్యమేనా అంటున్న ప్రజలు
రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం కంటే ‘మావిగన్’ మార్గమే మేలంటున్న అన్ని వర్గాలు
అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ‘మావిగన్’ దోహదపడుతుంది
మావిగన్ ద్వారా రాజధాని కల తక్షణమే సాకారం
ఇదే నిజమైన ప్రజా రాజధాని అంటున్న ప్రజలు.. ఎటు చూసినా ఇదే చర్చ
ఆచరణసాధ్యమైన ఈ ఆలోచనే మేలంటున్న మేధావులు, ఆర్థికవేత్తలు..
సోషల్ మీడియా, రాజకీయ, వ్యాపార వర్గాలలో విస్తృత చర్చ
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు(మావిగన్) ఆలోచన రాష్ట్రమంతా చర్చకు దారితీసింది. ఇది అత్యంత వాస్తవికమైన ఆలోచన అని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఒక ఆచరణాత్మకమైన పద్ధతిలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, ప్రజలకు సంక్షేమం అందించాలన్న ఉద్దేశంతోనే.. తక్కువ ఖర్చుతో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా మారే అవకాశం ఉన్న విశాఖపట్నంను నాడు రాజధానిగా ప్రతిపాదించానని చాలా స్పష్టంగా, అరమరికలు లేకుండా వైఎస్ జగన్ వివరించిన తీరుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్‌ను రాజధాని ప్రాంతంగా ప్రకటించి.. చంద్రబాబు చెబుతున్న దానిలో కేవలం పది శాతం పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేస్తే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లను తలదన్నే రీతిలో స్వల్పకాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెంది.. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన ఆచరణాత్మకమైనదని, రాష్ట్రానికి ఆర్థికంగా ఎలాంటి భారం లేనిదంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.
రాజధాని సంగతి దేవుడెరుగు.. 12 ఏళ్లలో కనీసం రోడ్లయినా వేయలేని పరిస్థితులలో రోడ్లు, కరెంటు, నీటివసతి, డ్రైనేజీ లకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయడమంటే సాధ్యమయ్యే పనేనా అని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 12 ఏళ్లుగా కనీసం రోడ్లు వేయలేకపోవడం, ప్లాట్లు కేటాయించకపోవడం చూస్తుంటే.. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ జరిగే పనేనా అని జనం చర్చించుకుంటున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో 12 ఏళ్లవుతున్నా ఇప్పటికీ రోడ్లు కూడా లేవు. మరో 20 ఏళ్లలో కూడా పూర్తి చేసే పరిస్థితులు లేవు. జగన్ ప్రతిపాదించిన మూడు నగరాలను కలుపుతూ హైవే ఉంది. ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి. కనుక రాజధాని కోసం రూ. 2 లక్షల కోట్ల అప్పులు చేయనక్కరలేదని ఆర్థికవేత్తలంటున్నారు. అందులో 10శాతం చాలు ఈ ప్రాంతాన్ని మహానగరంలా అభివృద్ధి చేయడానికి అని వారు పేర్కొంటున్నారు.
అందువల్ల జగన్ ప్రస్తావించిన ప్లాన్ బీ మంచిదే కదా అని ఆర్థికవేత్తలు, మేధావులు, విద్యావేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం ఉద్యోగుల జీతాలకే సరిపోవడం లేదని, కేంద్రం నుంచి వచ్చేది అప్పులు, వడ్డీలకే చాలడం లేదని చంద్రబాబే చెబుతున్న నేపథ్యంలో రాజధానికి రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఎప్పటికి తెస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలు చేయడమంటే భ్రమల్లో ముంచడమే కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సంక్షేమం ఆగిపోయి ప్రజలు విలవిల్లాడుతున్నారు..సూ్కళ్లు, హాస్పిటల్స్‌ను పట్టించుకునే నాథుడే లేడు. పథకాలన్నీ ఆగిపోయాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆచరణసాధ్యం కాని ఆలోచనలు చేయడం సబబేనా! అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నది బూటకమే..
రాజధాని అమరావతికి తొలి విడత రైతుల నుంచి సమీకరించిన భూమి.. ప్రభుత్వ భూమితో కలిపి మొత్తం 53,748 ఎకరాలని.. వాటిలో భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతుందని.. ఆ భూమిని విక్రయిస్తే రూ.లక్ష కోట్లు వస్తాయని.. దానితో రాజధాని నిర్మించవచ్చునని 2016 నుంచే సీఎం చంద్రబాబు ప్రకటిస్తూ వచ్చారు. కానీ.. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని, ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని వల్లె వేస్తున్నారు. ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి భూములు లేవని.. అందుకోసం తుళ్లూరు, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లో 11 గ్రామాల పరిధిలో రైతుల నుంచి 44,676.64 ఎకరాలతోపాటు ప్రభుత్వ భూమి కలిపి మరో 50 వేల ఎకరాలు సమీకరించేందుకు సిద్ధమయ్యారు.
అందులో భాగంగా ఇప్పటికే 20,494.57 ఎకరాల సమీకరణకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. రాజధాని అమరావతి కోసం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన, తేవాలని నిర్ణయించిన అప్పులే రూ.47,387 కోట్లు. రాజధానిలో నివాస స్థలం చదరపు గజం రూ.50 వేల చొప్పున పలుకుతోందని సీఆర్‌డీఏ చెబుతోంది. కానీ.. రాజధాని ప్రధాన ప్రాంతం(కోర్ కేపిటల్ ఏరియా)లో అంటే రాజధాని నడిబొడ్డున.. వెలగపూడిలో సచివాలయం సమీపంలో సర్వే నెంబరు 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను(25 వేల చదరపు గజాలు) కంచర్ల సాంబశివరావు, కంచర్ల శాంతికిరణ్, కంచర్ల ఓంకార్, కాట్రగడ్డ గీతాశ్రీలకు సీఆర్‌డీఏ ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి ట్రస్టీగా ఉన్న నివాస ట్రస్టు పేరు మీద రూ.18.75 కోట్లకు కొనుగోలు చేసి 2025, ఏప్రిల్ 2న మంగళగిరి సబ్ రిజిష్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులోనే నివాసం నిర్మిస్తున్నారు. ఈలెక్కన గజం ధర రూ.7,500 చొప్పున కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. అంటే ఎకరం ధర రూ.3.63 కోట్లే. దీన్ని బట్టి చూస్తే.. లక్ష ఎకరాల్లో రాజధాని అమరావతిలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఖర్చు చేసే రూ.2 లక్షల కోట్లను వడ్డీతో కలిసి చెల్లించాలంటే ఎన్ని వేల ఎకరాలను విక్రయించాల్సి ఉంటుంది..
మహానగరంగా అభివృద్ధి చెందడానికి అన్ని విధాలా అనుకూలం..
మచిలీపట్నం వద్ద వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నౌకాశ్రయం(పోర్టు) నిర్మాణం చేపట్టింది. మచిలీపట్నం–విజయవాడ ఆరు వరుసల జాతీయ రహదారి.. విజయవాడ–గుంటూరు మధ్య ఆరు వరుసల జాతీయ రహదారి ఉంది. విజయవాడ శివార్లలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విజయవాడ చుట్టుపక్కల 20 లక్షలు.. గుంటూరు చుట్టుపక్కల 10 లక్షలు.. మచిలీపట్నం చుట్టుపక్కల 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు ఇప్పటికే నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో కృష్ణా నదీ జలాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. నౌకాశ్రయం, విమానాశ్రయం సమీపంలోనే ఉండటం వల్ల ఎగుమతులు, దిగుమతులకు అత్యంత అనువైన ప్రాంతం. ఇది ఐటీ వంటి స్మార్ట్ ఇండస్ట్రీస్‌తోపాటు భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
మావిగన్ కారిడార్‌ను రాజధానిగా ప్రకటించి.. అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి పోటీ పడటం ఖాయమంటున్నారు. చెన్నై సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం.. ముంబైకి సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం వల్లే భారీ ఎత్తున పెట్టుబడులు తరలిరావడంతో ఆ నగరాలు స్వల్ప కాలంలోనే మహానగరాలుగా రూపాంతరం చెందాయని, వాటితరహాలోనే మావిగన్ కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్‌కు ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున పదేళ్లలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే చాలు.. (చంద్రబాబు సమీకరించిన భూముల్లో సదుపాయాల కోసం అంచనా వేసిన రూ. 2 లక్షల కోట్లలో ఇది కేవలం 10శాతమే) ఆ పదేళ్లలోనే మహానగరంగా మారుతుందని పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇది లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే ఏళ్ల తరబడి వేచిచూడక్కరలేకుండా.. ఈ ఫలాలు తమకు తక్షణం అందుతాయని కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు పేర్కొంటున్నారు.
స్కామ్‌ల కోసం భ్రమలు కల్పిస్తారా?
రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణాల కాంట్రాక్టు విలువను పరిశీలిస్తే చదరపు అడుగుకు రూ.11 వేల నుంచి రూ.14 వేల వరకూ చెల్లిస్తున్నారు. పైగా ఇసుక ఉచితం. కూతవేటు దూరంలో పుష్కలంగా ఇసుక దొరుకుతుంది. కానీ.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇసుక కొనుగోలు చేసి.. జీఎస్టీ వంటి పన్నులు చెల్లిస్తూ ఫైవ్ స్టార్ సదుపాయాలతో.. ఇటాలియన్ మార్బుల్స్‌తో చదరపు అడుగు కేవలం రూ.4,500కే నిర్మిస్తున్నారని ఇంజినీర్లు గుర్తు చేస్తున్నారు. ఇక నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలో ఆరు వరసల జాతీయ రహదారి కిమీకు సగటున రూ.20 కోట్లకు నిర్మిస్తుంటే.. అమరావతిలో అదే రోడ్లకు రూ.53 కోట్లను ఖర్చు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. నిర్మాణ పనుల్లో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. లక్ష ఎకరాల్లో అమరావతి నిర్మాణం సమీప భవిష్యత్తులో ఆచరణ సాధ్యం కాదని తెలిసినా.. ప్రజలకు భ్రమలు కల్పిస్తూ.. స్కామ్‌ల కోసం అమరావతికి చట్టబద్ధత పేరుతో సీఎం చంద్రబాబు డ్రామాలాడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధి చెందడానికే వందేళ్ల సమయం పడుతుందని చంద్రబాబు సర్కారే చెప్పడాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తుండటం గమనార్హం.
మావిగన్ ప్రతిపాదన ఓ అద్భుతం
రాష్ట్ర రాజధాని ప్రాంతం, దాని అభివృద్ధి విషయంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన సూచన అద్భుతం. రాష్ట్ర రాజధాని ప్రాంతం అభివృద్ధిపై కీలక ప్రభావం చూపుతుంది. కనీస వనరులు లేని ప్రాంతంలో వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చుపెట్టి రాజధాని అభివృద్ధి చేయటం సాధ్యం కాని పని. అదే మచిలీపట్నం నుంచి గుంటూరు వరకూ ఉన్న ప్రాంతాన్ని ప్రత్యామ్నాయ రాజధాని ప్రాంతంగా ఆలోచిస్తే జాతీయ రహదారికి రెండు వైపులా విస్తరించి ఉన్న ప్రాంతాలు సమృద్ధిగా అభివృద్ధి సాధిస్తాయి. రియల్ వ్యాపారం పుంజుకుంటుంది. పోర్టు ద్వారా నిత్యం వస్తు రవాణా సాగుతుంది. ఈప్రాంతానికి తగిన ప్రాధాన్యం దక్కుతుంది.
– నర్రా రమేష్‌బాబు, రియల్ వ్యాపారి, కంకిపాడు, కృష్ణాజిల్లా
తీర ప్రాంత రాజధానులే మహానగరాలుగా ఎదిగాయి
సముద్ర, నదీ తీర ప్రాంతాల్లో ఉన్న రాజధాని నగరాలే మెట్రో నగరాలుగా అభివద్ధి చెందాయి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పిన విధంగా పలు జాతీయ రహదారుల కలయికతో ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ మావిగన్ రాజధానిగా ప్రకటిస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. మచిలీపట్నంలో ఉన్న నౌకాశ్రయం, విజయవాడ విమానాశ్రయం జాతీయ రహదారులు ఈ ప్రాంతం పెద్ద నగరాలతో పోటీపడేలా అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి. జగన్ ముందుచూపుతో ప్రకటించిన ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు పోకుండా సానుకూలంగా స్పందించి అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
– బందెల డేవిడ్ థామస్ నోబుల్, రైల్వే సలహా మండలి సభ్యుడు, మచిలీటప్నం
మావిగన్‌తో సమన్యాయం
రాజధాని లేని రాష్ట్రానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ సమన్యాయం చేస్తుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా ఉన్న గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంలను కలుపుతూ రాజధానిగా ప్రకటించడం వలన ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా, అప్పులు తెచ్చి రాజధాని నిర్మించాల్సిన అవసరం లేకుండా పరిపాలన సాగించవచ్చు. రాష్ట్రానికి మధ్య ప్రాంతం కావడంతో అన్ని ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది.
– జి.శాంతమూర్తి, ఇంటిలెక్చు్యవల్ ఫోరం వ్యవస్థాపకుడు, గుంటూరు
రాష్ట్రానికి సరైన రాజధాని మావిగన్
మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ జాతీయ రహదారితో పాటు అన్ని రకాల మౌలిక వసతులు ఉండటంతో అన్ని ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. రాజధానికి భూములు ఇచ్చి, తీవ్ర నిర్వేదంతో ఉన్న రైతులకు ప్రయోజనం చేకూర్చడంలో ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం దురదృష్టకరం. ప్రతిపాదిత మావిగన్‌ను రాజధానిగా విస్తరించేందుకు లక్షల కోట్ల నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదు.
– మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆగ్జిలరీ సొసైటీ అధ్యక్షుడు, గుంటూరు


