ఎల్‌ఓసీ పేరుతో సజ్జల భార్గవ్‌రెడ్డిని ఎందుకు వేధిస్తున్నారు? | Why is Sajjala Bhargav Reddy being harassed in the name of LoC | Sakshi
Sakshi News home page

ఎల్‌ఓసీ పేరుతో సజ్జల భార్గవ్‌రెడ్డిని ఎందుకు వేధిస్తున్నారు?

Apr 3 2026 5:23 AM | Updated on Apr 3 2026 5:23 AM

Why is Sajjala Bhargav Reddy being harassed in the name of LoC

కేసుల పేరుతో పౌరులను వేధిస్తుంటే చూస్తూ ఊరుకోం 

ఎల్‌ఓసీ జారీపై కౌంటర్ల దాఖలుకు ఆదేశిస్తే డీజీపీ, ఎస్‌పీలు పట్టించుకోలేదు  

కౌంటర్ల దాఖలుకు చివరి అవకాశంగా వారం గడువు  

లేకుంటే డీజీపీ, ఎస్‌పీలు కోర్టు ముందు హాజరు కావాల్సి వస్తుందని స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: సోషల్‌ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా విభాగం పూర్వ ఇన్‌చార్జ్‌ సజ్జల భార్గవ్‌రెడ్డిపై లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీ చేసిన వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హైకోర్టు నిప్పులు చెరిగింది. ఎల్‌ఓసీ పేరుతో పిటిషనర్‌ను ఎందుకు వేధిస్తున్నారని  ప్రశ్నించింది. కేసుల పేరుతో పౌరులను అనవసరంగా వేధింపులకు గురి చేస్తుంటే కోర్టులు చూస్తూ ఊరుకోవని స్పష్టం చేసింది. బాధితులు ఎవరు? ఏ పార్టీకి చెందిన వారు అన్న విషయాలతో సంబంధం లేకుండా తాము ప్రాథమిక హక్కులను కాపాడుతామని స్పష్టం చేసింది.  

ధిక్కార స్వరాలను సహించేదే లేదు.. 
సోషల్‌ మీడియా పోస్టుల వ్యవహారంలో సీఐడీ అదనపు డీజీ, పలు జిల్లాల ఎస్‌పీల ప్రోద్బలంతో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు జారీ చేసిన ఎల్‌ఓసీని చట్ట విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ సజ్జల భార్గవ్‌రెడ్డి గత నెలలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులతో పాటు, ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న డీజీ­పీ, సీఐడీ సహా పలు జిల్లాల ఎస్‌పీలను కౌంటర్లు దాఖలు చేయాలని గత నెల 18వ తేదీన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

తాజాగా ఈ పిటి­షన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ దేవానంద్‌.. అన్నమ­య్య జిల్లా ఎస్‌పీ, సీఐడీ ఎస్‌పీ మినహా మరెవరూ కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌ఓసీ కోరింది ఎవరు? ఎందుకు కోరారు? ఏ కేసులో కోరారు? అన్న విషయా­లను తెలుసుకునేందుకు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తే, ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయకుండా ధిక్కార స్వరం వినిపిస్తున్నారని ఆక్షేపించారు.   

డీజీపీనే కౌంటర్‌ వేయనప్పుడు.. ఎస్‌పీలు ఎలా వేస్తారు? 
అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారంటూ జస్టిస్‌ దేవానంద్‌ మండిపడ్డారు. కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు వెనుకాడటం లేదన్నారు. డీజీపీనే కౌంటర్‌ వేయలేదని, అలాంటప్పుడు ఎస్‌పీలు కౌంటర్లు వేస్తారని ఎలా ఆశించగలమని ఘాటుగా వ్యాఖ్యానించారు. డీజీపీతో సహా అందరినీ కోర్టుకు పిలిస్తేనే పరిస్థితులు చక్కబడేలా ఉన్నాయన్నారు. సీఐడీ ఎస్‌పీ ప్రతివాదిగా ఉంటే, సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ కౌంటర్లు దాఖలు చేయడాన్ని సైతం న్యాయమూర్తి తీవ్రంగా తప్పుపట్టారు.   

భార్గవ్‌రెడ్డికి ఎల్‌ఓసీ జారీ చేసిన వ్యవ­హా­రంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఇమ్మిగ్రేషన్‌ అధికారులను, రాష్ట్ర డీజీపీ, సీఐడీ ఎస్‌పీ, విజయవాడ, పల్నాడు, వైఎస్సార్‌ కడప, తూర్పు గోదావరి, శ్రీసత్యసాయి, గుంటూ­రు, అన్నమయ్య, ఏలూరు, బాపట్ల జిల్లాల ఎస్‌పీ­లను ఆదేశిస్తూ.. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు.  తదుపరి విచారణకు కౌంటర్లు దాఖలు చేయకుంటే, డీజీపీతో సహా ఎస్‌పీలందరూ కోర్టు ముందు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని తేల్చి చెబుతూ విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారు.  

పరస్పర విరుద్ధ వైఖరులపై అసంతృప్తి 
విచారణ సమయంలో భార్గవ్‌రెడ్డి తరఫు న్యాయ­వాది యల్లారెడ్డి స్పందిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదు చేశారన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్‌పీ దాఖలు చేసిన కౌంటర్‌లో భార్గవ్‌రెడ్డిపై ఎల్‌ఓసీ జారీ చేయాలని ఇమ్మిగ్రేషన్‌ అధికారులను తాము కోరలేదని పేర్కొన్నారని తెలిపారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, అలా అయితే ఎవరు కోరితే ఎల్‌ఓసీ జారీ చేశారని ఇమ్మిగ్రేషన్‌ అధికారుల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ధనంజయను ప్రశ్నించారు. 

అన్నమయ్య జిల్లా ఎస్‌పీ, సీఐడీ అదనపు డీజీ కోరితేనే భార్గవ్‌రెడ్డిపై ఎల్‌ఓసీ జారీ చేశామని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని, వాటిన్నింటినీ కౌంటర్‌ రూపంలో కోర్టు ముందుంచు­తామని చెప్పారు. అయితే ఎల్‌ఓసీ జారీ చేయాలని తామెవ్వరినీ కోరలేదని ఎస్‌పీ తరఫు న్యాయవాది, అలాగే సీఐడీ అదనపు డీజీ తరఫు న్యాయవాది పాణిని సోమయాజి ఈ సందర్భంగా పేర్కొన్నారు.  

ఈ పరస్పర విరుద్ధ వైఖరులపై జస్టిస్‌ దేవానంద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు ఇలాంటి నాటకాలు ఆడతారనే అందరి కౌంటర్లకు  ఆదేశించామని పేర్కొన్నారు. అధికారుల ధిక్కార స్వరానికి ముగింపు పలికే సమయం వచి్చందన్న న్యాయమూర్తి, తద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడుతామని స్పష్టం చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement