పెట్టరా పేరు అమరావతి.. పిలవరా కమ్మరావతి! | MP Renuka Chowdhury comments in Rajya Sabha | Sakshi
Sakshi News home page

పెట్టరా పేరు అమరావతి.. పిలవరా కమ్మరావతి!

Apr 3 2026 5:38 AM | Updated on Apr 3 2026 5:38 AM

MP Renuka Chowdhury comments in Rajya Sabha

రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు  

అమరావతి పేరు మార్పు కంటితుడుపు మాత్రమే.. 

విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్రానిది మొండిచేయి 

ఆ ఐదు మండలాలను వెంటనే తెలంగాణలో కలపాలి

సాక్షి, న్యూఢిల్లీ: పెట్టరా పేరు అమరావతి.. లేక­పోతే పిలవరా ’కమ్మ’రావతి అంటూ రాజధాని అమరావతి పేరు చుట్టూ సాగుతున్న రాజకీయాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. గురువారం రాజ్యసభలో ‘ఏపీ పునర్విభజన (సవరణ) బిల్లు–­2026’పై జరిగిన చర్చలో ఆమె పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు.  

ఇది కంటితుడుపు మాత్రమే.. 
‘అది ఎలాగూ అమరావతే. నేను అప్పటి ముఖ్యమంత్రి­తో కూడా చెప్పాను.. ’పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా పేరు కమ్మరావతి.. పెట్టు పేరు!’ అని నేనే అన్నాను. వారికి (కేంద్రానికి) అంత ధైర్యం ఉంటే, చెప్పింది అమలు చేసే సాహసం కూడా చేయమనండి. ఇది కేవలం ఒక కాస్మెటిక్‌ టచ్‌ (కంటితుడుపు చర్య) మాత్రమే.. క్షేత్రస్థాయిలో ఏమీ మారలేదు. 12 ఏళ్ల తర్వాత అమరావతి రాజధాని అని ప్రభుత్వం నిర్ణయిస్తే.. మేము వారిని మెచ్చుకోవాలా? కృతజ్ఞతలు చెప్పాలా? ఇది జాతీయ అవమానం. 

విభజన చట్టంలోని హామీలైన కడప స్టీల్‌ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్టు ఏమయ్యాయి? 1.42 లక్షల కోట్ల ఆస్తుల పంపిణీ ఎందుకు తేలలేదు? ఈ సభ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి దశాబ్దంపైగా సమయం తీసుకోవడం మీ వైఫల్యం కాదా?‘ అని రేణుక చౌదరి కేంద్రాన్ని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందని రేణుకా చౌదరి ఆరోపించారు. ‘గుజరాత్‌లో రాజధాని అభివృద్ధికి వేల కోట్లు కుమ్మరిస్తున్నారు.. కానీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మాత్రం కించపరుస్తున్నారు’ అని మండిపడ్డారు. 

ఆ ఐదు మండలాలు.. తెలంగాణలో కలపాలి..
భద్రాచలం రామాలయ ఆస్తులు ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం మండలాల ప్రజలు ప్రస్తుతం ‘నో మ్యాన్స్‌ ల్యాండ్‌’లో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ సంక్షేమ పథకాలు అందక వారు నరకం చూస్తున్నారు. ఆ మండలాలను వెంటనే తెలంగాణలో కలపాలి‘ అని డిమాండ్‌ చేశారు. విభజన హామీల అమలుపై పార్లమెంటులో ‘స్టేటస్‌ పేపర్‌’ విడుదల చేయాలని, ప్రతి హా­మీకి సంబంధించి కాలపరిమితితో కూ­డిన ‘రోడ్‌ మ్యాప్‌’ ప్రకటించాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement