పోలీసులు సీజ్‌ చేసిన బోట్లు దొంగతనమా? | YS Jagan slams Chandrababu Naidu government | Sakshi
Sakshi News home page

పోలీసులు సీజ్‌ చేసిన బోట్లు దొంగతనమా?

Apr 16 2026 5:30 AM | Updated on Apr 16 2026 5:30 AM

YS Jagan slams Chandrababu Naidu government

మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకున్న బోట్లు వదిలేస్తారా?

బీద సోదరులు కుట్ర పన్నిదొంగతనంగా తీసుకెళ్లిపోయారు  

పోలీసులు సీజ్‌ చేసిన బంగారాన్ని ఎవరైనా పోలీస్‌ స్టేషన్‌ నుంచి దొంగతనంగా ఎత్తుకెళ్లిపోతే మీరు ఇలాగే విడిచి పెడతారా చంద్రబాబూ?

మత్స్యకారులంటే మీకు ఇంత చులకనా? ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగదు  

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మండిపాటు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబునాయుడు మత్స్యకారులకు మేలు చేయకపోగా వారి కడుపు మీద కొడుతున్నాడని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను సందర్శించిన అనంతరం అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడారు. 

‘ఇది మన రాష్ట్ర మత్స్యకారులకు సంబంధించిన ఫిషింగ్‌ ఏరియా. ఈ ప్రాంతంలోకి పక్క రాష్ట్రాల మత్స్యకారులు ఎవరూ రాకూడదు. అందుకు సంబంధించి కఠిన నిబంధనలు ఉన్నాయి. అయినా వాటిని ఉల్లంఘించి తమిళనాడులోని కరైకల్‌ ప్రాంతానికి చెందిన మెకనైజ్డ్‌ బోట్లు మన ప్రాంత జలాల్లోకి ప్రవేశించి మన మత్స్యసంపదను తరలించుకు పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన మత్స్యకారులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వారికి కడుపు మండి వారే స్వయంగా రంగంలోకి దిగి ప్రాణాలకు తెగించి ఆ బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. 

పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సీజ్‌ చేసిన ఆ బోట్లను బీద సోదరులు కుట్ర పన్ని దొంగతనంగా తీసుకెళ్లిపోయారు. ఇందుకు బీద సోదరులు, ఆయన అనుచరుడు కొండూరు పోలిశెట్టి, అక్కడి బోటు యజమాని అశోక్‌ మధ్య జరిగిన సంభాషణ, వారి కాల్‌ డేటానే సాక్ష్యం. నారా లోకేశ్‌ మార్చి 12న జువ్వలదిన్నెకు వస్తే, మార్చి 16న ఆ బోట్లను ఇక్కడి నుంచి తరలించుకుపోయారు. మత్స్యకారుల కడుపు కొట్టడం కోసం నారా లోకేశ్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎంతో మంది ఏకమయ్యారు. వారు కుట్ర పన్నినట్టు కాల్‌ డేటా ఆధారాలు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నా ఒక్కరినైనా అరెస్ట్‌ చేశారా? పోలీస్‌ అధికారులను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. 

చంద్రబాబును ఒకటే అడుగుతున్నా.. పోలీసులు సీజ్‌ చేసిన బంగారాన్ని ఎవరైనా పోలీస్‌ స్టేషన్‌ నుంచి దొంగతనంగా ఎత్తుకెళ్లిపోతే మీరు ఇలాగే విడిచి పెడతారా? మత్స్యకారులంటే ఇంత చులకనగా చూస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగదు. ఇంత కన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచ చరిత్రలో ఇంకొకటి ఉంటుందా?’ అంటూ మండిపడ్డారు.

ఫిషింగ్‌హార్బర్‌ మీకే.. ఇదే నా భరోసా
మీ అందరికీ భరోసా ఇస్తున్నా. కళ్లు మూసుకుని తెరిచే లోపల మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఈ ఫిషింగ్‌ హార్బర్‌ మీ హక్కు. ఈ ఫిషింగ్‌ హార్బర్‌ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మంచి జరిగేలా ఒక్కో బోటుకు 10, 12 మందిని యజమానులను చేస్తాం. ఫిషింగ్‌ హార్బర్లను మత్స్యకారులకు అంకితం చేస్తాం. ఇక్కడ పాళెం మత్స్యకారులు కొంత మంది పట్టపు కార్పొరేషన్‌ కావాలని అడిగారు. నాడు మన ప్రభుత్వంలో అడిగిన వారికి కాదనకుండా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మనం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పట్టపు కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నా.

ఈ ప్రభుత్వం మా కడుపు కొడుతోంది అన్నా..
అన్నా.. ఇక్కడ హార్బర్‌కు 79 ఎకరాల స్థలం ఉందన్నా. ఆరు జిల్లాల్లో సుమారు 150 మరపడవలు ఉన్నా­యి. కావలి నియోజక­వర్గంలోని ఆరు తీర ప్రాంత పంచాయతీల్లో మరో వెయ్యి వరకు సంప్రదాయ పడవలు ఉన్నాయి. హార్బర్‌ అందుబాటులోకి వస్తే నిత్య­ం నాలుగు వేల మంది వరకు రాక­పోకలు సాగించాల్సి ఉంటుంది. చేపలు ఆరబెట్టుకోవ­డం, ఐస్‌ ఫ్యాక్ట­రీలు, వలల రిపేర్లు, తదితర పనులకు ఉన్న స్థలం సరిపోద­నుకుంటుంటే కూటమి ప్రభుత్వం హార్బర్‌ స్థలంలో సగం ప్రైవేట్‌ సంస్థకు కేటాయించడం అంటే హార్బర్‌ను పూర్తిగా మూసివేయడంతో సమా­నం. 

మీ హయాంలో 95 శాతం పూర్తయిన హార్బర్‌లో మిగిలిన ఐదు శాతం పూర్తి చేసి, అందుబాటులోకి తేకపోవడం మా కడుపులు కొట్టడమే. మీరే మాకు అండగా నిలబడి న్యాయం చేయాలన్నా. మావాళ్లు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అధికారులకు అర్జీలు ఇచ్చి విసిగిపోయిన తర్వాత, ప్రాణాలకు తెగించి అక్రమంగా వేట సాగిస్తున్న కడలూరుకు చెందిన పడవలను పట్టుకుని నాలుగు జిల్లాల్లోని 160 గ్రామాలకు చెందిన మత్స్యకారులు వంతుల వారీగా కాపలా ఉంటే పోలీసుల సాయంతో పడవలు తప్పించేశారు. ఈ విషయంలో కూడా మాకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నా.    –  రామచంద్రయ్య, మత్స్యకారుడు, అన్నగారిపాళెం, కావలి రూరల్‌ మండలం 

ఇలాగైతే మేము బతకలేం జగనన్నా..
అన్నా.. మీ హయాంలో హార్బర్‌ వచ్చింది. త్వరత్వరగా నిర్మాణం కూడా పూర్తి చేశారు. మాకు చాలా సంతోషం కలిగిందన్నా. హార్బర్‌ రాక ముందు మేము తెప్పల్లో వెళ్లి పది కిలోలు, 20 కిలోలు చేపలు తెచ్చుకునే వాళ్లం. వాటిని ఇక్కడ అమ్ముకునే వీలు లేక పల్లెలకు వెళ్లి అమ్ముకునేవాళ్లం. హార్బర్‌ వచ్చిన తర్వాత మా కష్టాలు తీరుతాయని ఆశ పడ్డాం అన్నా.

 వలసలు ఆగిపోతాయని, ఇక్కడే పని దొరుకుతుందని సంబర పడ్డాం. ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వం హార్బర్‌లో మిగిలిన కొద్దిపాటి పనులు నిలిపేసి, ప్రైవేట్‌ సంస్థకు భూములు ఇచ్చిందన్నా. మాకు ఆస్తిగా మీరు ఇచ్చిన హార్బర్‌ను ప్రైవేట్‌ సంస్థల చేతుల్లో పెడితే ఎలా అన్నా? మీరే మా మత్స్యకారులకు న్యాయం చేయాలన్నా. హార్బర్‌ భూములను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగిస్తే మా పరిస్థితి ఏమిటన్నా.. ఇలాగైతే మేము బతకలేం జగనన్నా.
– రంగయ్య, మత్స్యకారుడు, అలిచెర్ల బంగారుపాళెం, జువ్వలదిన్నె

Advertisement
 
Advertisement
Advertisement