Sakshi News home page

పక్కా స్కెచ్చేనా..? అందుకే వాస్తవాలు రాయడానికి చేతులు రాలేదా రామోజీ?

Published Tue, Aug 8 2023 11:36 AM

Yellow Media Fake Propaganda On Punganur Incident - Sakshi

ఎక్కడైనా  ఏదైనా ఘర్షణ జరిగితే బాధితుల తరపున అండగా నిలవాలని అనుకుంటాం. కాని  దురదృష్టవశాత్తు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలకు కాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి, తదితర మీడియా సంస్థలకు కాని కనీస కరుణ, దయ కొరవడ్డాయి. పుంగనూరులో పాశవికంగా పోలీసులపై టీడీపీ కార్యకర్తలుగా చెప్పుకునే గూండాలు దాడులు చేసి తీవ్రంగా గాయపరిస్తే, సానుభూతి తెలపకపోగా, గూండాలకు మద్దతు ఇచ్చే నీచ సంస్కృతికి వెళుతున్నారంటే దానిని ఏమి రాజకీయం అనుకోవాలి. ఇంత వికృతంగా రాజకీయం, పాత్రికేయం మారిపోవడం ఆంధ్రప్రదేశ్ దురదృష్టం.

తెల్లవారి లేస్తే నీతులు చెప్పే ఈనాడు రామోజీరావు ఈ స్థాయిలో అరాచక శక్తులకు మద్దతు ఇవ్వడం అంటే ఇంతకన్నా నీచమైన జర్నలిజం మరొకటి ఉండదేమో! టీడీపీ దాడిలో తలలు పగిలిన పోలీసులు, కన్ను కోల్పోయిన కానిస్టేబుల్ ఇలా ఇరవైఏడు మంది ఆస్పత్రి పాలైనా , ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాక్షసత్వంతో మాట్లాడారంటే ఆయన తత్వం అంతేలే అని సరిపెట్టుకోవచ్చు. కాని వైసీపీవారు అక్కడ దాడిచేశారు.. ఇక్కడ దాడి చేశారు అని అబద్దాలో,సబద్దాలో నిత్యం వండి వార్చే ఈనాడు మీడియాకు టీడీపీ గూండాల విధ్వంసం కనిపించలేదు.

గుర్తు తెలియని వ్యక్తులు పుంగనూరులో పోలీసు వాహనాలకు నిప్పంటిచారని రాయడం చండాలపు జర్నలిజానికి పరాకాష్ట. ఇలాంటి ఘటనలను ఉన్నది, ఉన్నట్లు ఇస్తే, ఎవరిది తప్పైతే వారి గురించి రాస్తే మీడియాకు విలువ ఉంటుంది. కాని తాము మద్దతు ఇచ్చే టీడీపీకి నష్టం జరుగుతుందన్న భావనతో వాస్తవాలు రాయడానికి చేతులు రాకపోతే అది విలువలు లేని మీడియానే అవుతుంది. అలాంటప్పుడు ఈనాడు పత్రికపై చంద్రబాబు ఫోటో వేసుకుని వారిష్టం వచ్చినట్లు రాసుకుంటే సరిపోతుంది.
చదవండి: కోతల బాబు రోత మాటలు.. ఎక్కడికి వెళ్లి ఏం మాట్లాడుతున్నారో..!

పుంగనూరు ఘటన జరిగిన తర్వాత రోజు  ఈనాడు పత్రిక మొదటి పేజీలో పోలీసు వాహనాలకు నిప్పు పెడుతున్న టీడీపీ వారి ఫోటోలు ప్రచురించలేదు. పైగా పోలీసులు తప్పు కూడా ఉందన్న అభిప్రాయం కల్పించడానికి, వైసీపీపై ఆరోపణలు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. పుంగనూరులో టీడీపీ వారు  మొత్తం ప్లాన్ ప్రకారమే విధ్వంసం సృష్టించే యత్నం జరిగినట్లు అనిపిస్తుంది. పుంగనూరులో కాని, అంగళ్లు అనే గ్రామం వద్ద కాని చంద్రబాబు నాయుడు తన కార్యకర్తలను రెచ్చగొట్టిన తీరు ఆయన మానసిక పరిస్థితిని తెలియచేస్తుంది.

డెబ్బైనాలుగేళ్ల వయసులో అలాంటి వాటిని ప్రోత్సహించకుండా, ఒకవేళ వైసీపీవారు ఎవరైనా ఎదురైనా, గొడవలకు ఆస్కారం ఇవ్వవద్దని చెప్పగలిగి ఉంటే సంస్కారయుతంగా ఉండేది. కాని ఆయనే బూతులు తిడుతూ టీడీపీ వారిని గూండాయిజం చేయాలని పురమాయించడం  దారుణం. పైగా అంతా చేసి తనను కూడా వివేకా మాదిరి చంపుతారా అని ఎదురుదాడి చేయడం ఆయనలోని రాజకీయ పైశాచికత్వానికి పరాకాష్ట అని చెప్పాలి. పుంగనూరులో జరిగినమొత్తం ఘటనను విశ్లేషించి పోలీసు అధికారులు మీడియాకు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వింటే తెలుగుదేశం పార్టీ ఎంత నైచ్యానికి దిగజారింది తెలిసిపోతుంది పోలీసు వాహనాలను దగ్ధం చేయడమే కాకుండా అనేకమంది పోలీసులపై టీడీపీ గుండాలు దాడి చేయడం అంటే అది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహస్యం పాలు చేయడమే.

పుంగనూరు బైపాస్ రోడ్ నుంచి నేరుగా వెళ్లిపోతామని రూట్ ఇచ్చి అనుమతి పొందిన  చంద్రబాబు ఆ తరువాత కావాలని పుంగనూరు పట్టణంలోకి వెళ్లడానికి ప్రయత్నించి ,అందుకు టీడీపీ రౌడీలను పురమాయించి పోలీసులపై దౌర్జన్యానికి దిగేలా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. చంద్రబాబు వాహనం పైన ఉన్న ఒక టీడీపీ నాయకుడు కిందికి దిగివచ్చి కార్యకర్తలతో ఈ అల్లర్లు చేయించారట.ఇంకా చంద్రబాబుపై కేసు పెట్టలేదు కాని, డెబ్బై రెండు మందిని ఇంతవరకు అరెస్టు చేశారు. కీలక నిందితుడు మాత్రం పరారీలో ఉన్నారు. పెట్రోల్ క్యాన్లు తీసుకురావడం తుపాకీ, తుటాలతో తిరగడం ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసు అధికారుల సంఘం నేతలు స్పష్టం చేశారు.

తమను రెచ్చగొట్టడం ద్వారా కాల్పుల వరకు పరిస్థితిని తీసుకువెళ్లాలని యోచించారని కానీ తాము సంయమనంతో ఉండడంతో తమ వాళ్లే రాళ్ల దెబ్బలు తినాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత ఇదేదో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవని అనుకున్నారు. అలాగే ప్రచారం కూడా చేసేశారు. తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి వైసీపీ వారిపై దారుణమైన అసత్యాలు కూడా ప్రచారం చేశాయి. కానీ పోలీస్ ఎస్పీ పరిస్థితిని వివరిస్తూ టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దౌర్జన్యానికి దిగారని, పుంగనూరు పట్టణంలోనికి అనుమతించాలని రభస సృష్టించారని  తెలిపారు.

పొరపాటున ఈ మూకలన్నీ పుంగనూరులో ప్రవేశించి ఉంటే ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు చాలా నష్టం ఏర్పడి ఉండేదని ఆయన అన్నారు. ఇది వాస్తవంగానే కనిపిస్తుంది. ఒక నాయకుడి వెంట ఎవరైనా పెట్రోల్ క్యాన్లు తీసుకుని వెళ్తారా, గన్ను పట్టుకుని తిరుగుతారా? ఒక యువకుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై పుడింగి భాషను వాడటమే కాకుండా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం పలు సందేహాలకు తావిస్తోంది. సంబంధిత వీడియో వైరల్‌గా మారాయి. కుప్పంతో సహా ఆ చుట్టుపక్కల పలు నియోజకవర్గాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు సాధించడంతో ఆయనపై కక్షతోనే ఈ ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

దురదృష్టవశాత్తు గౌరవ హైకోర్టు వారు ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా రోడ్లపై షోలకు ప్రజాస్వామ్యం పేరుతో అనుమతించడం వల్ల కూడా  సమస్యలకు ఆస్కారం ఏర్పడిందనిపిస్తోంది. పుంగనూరు అనేది చిన్న పట్టణం అక్కడ వీధులు చాలా ఇరుగ్గా ఉంటాయి. అక్కడ ఒక మోస్తరు సంఖ్య లో జనం పోగైనా  ట్రాఫిక్ ఆగిపోయి చాలా గందరగోళం ఏర్పడుతుంది. అందులోనూ రెండు పార్టీల కార్యకర్తలు ఎదురుపడితే అది చాలా విపరిణామాలకు దారితీస్తుంది.. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు ముందుగా అనుమతి పొందినట్లుగా బైపాస్ మీదుగా కాకుండా ఊర్లోకి రావాలని అప్పటికప్పుడు అనుకోవడం కచ్చితంగా కుట్ర స్వభావాన్ని తెలియజేస్తుంది కానీ పోలీసులు తాము తీవ్రంగా దెబ్బలు తిన్నప్పటికీ ఆ పరిస్థితిని నివారించగలిగారు.

కానీ టీడీపీ కార్యకర్తలు పెట్రోల్ పోసి మరి పోలీస్ వాహనాలు నిప్పంటించడాన్ని ఆపలేకపోయారు. మరో సంగతి ఏమిటంటే వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు ప్రాజెక్టు యాత్రకు నిరసనగా ఒక కార్యక్రమం చేపట్టి  మధ్యాహ్నానికే పూర్తి చేసేశారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా మాత్రం  చంద్రబాబు యాత్రకు అడుగడుగునా వైకాపా అడ్డంకులు అంటూ పచ్చి అబద్దాలను ప్రచురించారు, ప్రసారం చేశారు. వైసీపీ నిరసనలకు కారణం ఏమిటంటే చిత్తూరు ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాలకు ఉపయోగపడే రిజర్వాయర్లను ప్రభుత్వం నిర్మిస్తుంటే తమ కార్యకర్తల ద్వారా చంద్రబాబు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేయించి ఆ పనులను నిలుపుదల చేయించారు.. పైగా ఇప్పుడు ఆ ప్రాజెక్టులు పూర్తి చేయలేదంటూ డబుల్ గేమ్ ఆడుతున్నారన్నది రైతులు విమర్శ.

ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబు టూర్‌ను అడ్డుకున్నట్టు అట వైసీపీ వారు దానిపై నిరసన చేస్తే ఘోరమట అదే టీడీపీ లేదా మరి ఎవరైనా వైసీపీకి వ్యతిరేకంగా చేస్తే అది ప్రజాస్వామ్యమట.. పోలీసులకు దెబ్బలు తగిలితే, తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైతే చంద్రబాబు కనీసం సానుభూతి ప్రకటించలేదు అలాగే ఆయన దత్తపుత్రుడుగా విమర్శలకు గురవుతున్న పవన్ కళ్యాణ్ సైతం పోలీసులపై దాడిని ఖండించకపోగా చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన విధ్వంసాన్ని సమర్థిస్తూ ప్రకటన చేశారు. ఈనాడు పత్రికలో పుంగనూరు రోడ్ షోకు అనుమతి ఇవ్వని పోలీసులు అంటూ దారుణమైన అసత్యాలని ప్రచురించడానికి సిగ్గుపడలేద.

ఎక్కడా టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాలను దహనం చేసిన ఫోటోలను మొదటి పేజీలో ప్రచురించలేదు. పైగా ఇదంతా కలిపి తెలుగుదేశ కార్యకర్తల విరోచిత చర్యగా తిప్పికొట్టారని, తిరగబడ్డారని తెలుగుదేశం మీడియా దిక్కుమాలిన వాదనను ప్రచారం చేసింది. చంద్రబాబు గారైతే పోలీసులను బట్టలు కూడా ఊడ తీయండి. మీ అంతు చూస్తా మీరు అసలు ఐపీఎస్‌యేనా మీ సంగతి చూస్తా అంటూ కార్యకర్తలు పెట్రేగి పోయేలా చేశారు.. అదే టైంలో కేంద్రానికి మాత్రం వైసీపీ వారు ఏదో చేసేసారంటూ పచ్చి మోసపు వినతి పత్రాలను కూడా పంపించేశారు అక్కడితో ఆగ లేదు అంటూ వివేకాలాగే నన్ను చంపుతారా అంటూ పిచ్చి ఆరోపణ చేస్తారు.

ఇంకోవైపు పెద్దిరెడ్డిని ఉద్దేశించి నా తడాఖా చూపిస్తా అని బెదిరిస్తారు.. ఏకకాలంలో రెండు పాత్రలను పోషించగల సమర్థుడు చంద్రబాబు అని అనుకోవాలి ఆయన వాటిలో పెద్దగా ఫీల్ అవ్వరు ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని బదనాం చేయాలని విశ్వయత్నం చేస్తుంటారు.. ఆ క్రమంలోనే పుంగనూరులో అరాచకం సృష్టించబోయి భంగపాటుకు గురై పార్టీ వారిని  కేసుల పాలు చేశారు. 74 ఏళ్ల వయసులో తన అధికార దాహం కోసం చంద్రబాబు ఇలాంటి ఘోరాలకు పాల్పడడం అత్యంత శోచనీయం.

దీన్ని ప్రభుత్వం కానివ్వండి.. పోలీసుల అధికారులు కానివ్వండి.. లాజికల్ ముగింపునకు తీసుకువెళ్లి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే దీన్ని మరింత అలసత్వంగా తీసుకుని వచ్చే ఎన్నికలలో ఇంకెన్ని ఘోరాలైనా చేయడానికి తెగబడతారు. మంత్రి అంబటి రాంబాబు చెప్పినట్లు చంద్రబాబుది ప్రాజెక్టుల యాత్ర కాదు ఆంధ్రప్రదేశ్ విధ్వంసాల యాత్ర చేస్తున్నట్లుగానే అనిపిస్తోంది.



-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement

What’s your opinion

Advertisement