ఆమె ఎలా చనిపోయింది..? | Women Death Become Mystery in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆమె ఎలా చనిపోయింది..?

May 7 2026 6:06 AM | Updated on May 7 2026 6:06 AM

Women Death Become Mystery in Andhra Pradesh

పల్లపు రేణుక (ఫైల్‌)

విచారణ నిమిత్తం క్రోసూరు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన మహిళ

సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా క్రోసూరు పోలీసుస్టేషన్‌కు విచారణ నిమిత్తం వచ్చిన ఒక మహిళ తీవ్ర గాయాలపాలై మంగళగిరి ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందడం తీవ్ర చర్చకు దారితీసింది.  సంబంధిత వర్గాల కథనం ప్రకారం... విడాకుల విషయంలో బాపట్ల కోర్టుకు తిరుగుతున్న క్రమంలో చీరా­లకు చెందిన పల్లపు రేణుక (39)కు  వెంకటేశ్వరరెడ్డి అనే కోర్టు కానిస్టేబుల్‌ పరిచయమయ్యాడు.  మొదటి భర్త విడాకుల అనంతరం వెంకటేశ్వరరెడ్డితో రేణుక కొంతకాలం సహజీవనం చేసింది. అప్పటికే రేణుకకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణుకకు పిల్లలు పుట్టరనే నెపంతో కానిస్టేబుల్‌ వెంకటేశ్వరెడ్డి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు, కేసుల దాకా వెళ్లింది. పొన్నూరులో పనిచేస్తున్న సమ­యంలో ఇదే వివాదంపై సస్పెండ్‌ అయిన వెంకటేశ్వరరెడ్డి ప్రస్తుతం గురజాలలో విధులు నిర్వహిస్తున్నాడు.  నాలుగేళ్ల క్రితం నమోదైన కేసులో శాఖాపరమైన విచారణ నిమిత్తం మంగళవారం సాయంత్రం క్రోసూరు సీఐ సురేష్‌ ముందు ఇద్దరు హాజర­య్యారు. సాయంత్రం 6 గంటల సమయంలో అల్పాహారం తిన్న తరువాత  రేణుకకు ఫిట్స్‌ రావడంతో మొదటి అంతస్తు నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యా­యని పోలీసులు పేర్కొన్నారు. వెంటనే మంగళగిరి ఎయి­మ్స్‌కు తరలించారు. చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందింది.  

ఎయిమ్స్‌ వద్ద  బంధువుల ఆందోళన 
రేణుక మృతిపై ఆమె బంధువులు మంగళగిరి ఎయిమ్స్‌ మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. రేణుకను పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌ వెంకటేశ్వరరెడ్డి కొట్టడంతోనే మరణించిందని ఆరోపించారు. రేణుక కింద పడిన వెంటనే ఎందుకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని, మంగళగిరికి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. కానిస్టేబుల్‌పై హత్య కేసు నమోదు చేసి శిక్షపడేలా చేయాలని డిమాండ్‌ చేశారు.  

సీఐల చర్చలతో మారిన సీన్‌ 
ఈ క్రమంలో బంధువులు, కులసంఘం నేతలతో పెదకూరపాడు, అచ్చంపేట సీఐలు చర్చించారు. మంగళగిరి ఎయిమ్స్‌ వేదికగా హైడ్రామా నడిచిన అనంతరం సాయంత్రానికి పోలీసులు మృతురాలి తల్లిదండ్రులు మాట్లాడుతున్న ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ‘రేణుకకు ఫిట్స్‌ ఉన్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఏం తినకపోవడం వల్ల కళ్లు తిరిగి కిందపడిపోయింది. మా బిడ్డ మృతిపై అనవసర రాద్దాంతం చేయొద్దు’ అని మృతురాలి తండ్రి చంద్రబాబు వీడియోలో పేర్కొన్నారు. ఈ మేరకు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకూరపాడు పోలీసులు మీడియాకు సమాచారమిచ్చారు.   

Advertisement
 
Advertisement
Advertisement