చేయి విరిగిందని వెళితే.. ప్రాణం పోయింది | Woman Ends Life In Visakhapatnam | Sakshi
Sakshi News home page

చేయి విరిగిందని వెళితే.. ప్రాణం పోయింది

May 15 2025 8:42 AM | Updated on May 15 2025 8:42 AM

Woman Ends Life In Visakhapatnam

వైద్యం వికటించి మహిళ మృతి

అనిల్‌ నీరుకొండ(ఎన్‌ఆర్‌ఐ) ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన

తగరపువలస(విశాఖపట్నం): వాష్‌రూమ్‌లో జారిపడి చేయి విరిగిన ఓ మహిళ తొలుత సంగివలసలోని అనిల్‌ నీరుకొండ(ఎన్‌ఆర్‌ఐ) ఆసుపత్రిలో చికిత్స పొంది. అక్కడ పరిస్థితి విషమించడంతో నగరంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తన భార్య మృతికి అనిల్‌ నీరుకొండ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె భర్త జనార్థన్‌ ఆరోపించారు. కుటుంబసభ్యులతో ఆసుపత్రి ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వివరాలివి. భీమిలి మండలం చిప్పాడలో నివాసముంటున్న దివీస్‌ ఉద్యోగి జనార్థన్‌ భార్య యర్రంశెట్టి రేవతి ఈ నెల 10న ప్రమాదానికి గురైంది. వెంటనే ఆమెను ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చేర్పించగా.. అక్కడ వైద్యం వికటించి అపస్మారక స్థితికి చేరుకుంది. 

మెరుగైన వైద్యం కోసం జనార్థన్‌ ఆమెను నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందింది. దీంతో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రేవతి మృతదేహంతో ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి ఎదుట ఆందోళన జరిగే అవకాశం ఉందని ముందే ఊహించిన సిబ్బంది.. మృతదేహాన్ని హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఆమె స్వగ్రామమైన అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరుకు మృతదేహాన్ని పంపే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కేజీహెచ్‌ వద్ద ఆమె భర్త ఆందోళనకు సన్నద్ధమయ్యారు. 

తన భార్య అపస్మారక స్థితికి చేరుకోవడానికి కారణమైన వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిని తక్షణమే సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. జనార్థన్‌కు సంఘీభావంగా ఆయన స్వగ్రామానికి చెందిన బంధువులు, దివీస్‌ ఉద్యోగులు, పలు ప్రజా సంఘాల నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సాయంత్రం 8 గంటల తర్వాత వారంతా కలిసి సంగివలసలోని ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆసుపత్రి యాజమాన్యం ఆందోళనకారులు, బాధితుల తరపున వచ్చిన ప్రజా సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభించింది. భీమిలి పోలీసులు ఆసుపత్రి వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement