రేటే 'బంగార'మాయెనే.. | The price of gold is increasing day by day | Sakshi
Sakshi News home page

రేటే 'బంగార'మాయెనే..

Sep 17 2025 6:03 AM | Updated on Sep 17 2025 6:04 AM

The price of gold is increasing day by day

రోజురోజుకీ పెరుగుతున్న పుత్తడి ధర 

10 గ్రాముల ధర రూ.1.11 లక్షల పైమాటే.. 

ఇప్పట్లో రూ.లక్ష దిగువకు వచ్చే సూచనలు లేవంటున్న వ్యాపారులు 

అదే బాటలో దూసుకుపోతున్న వెండి 

సాక్షి, విశాఖపట్నం : పసిడితో భారతీయులకు ఉన్న అనుబంధం మరే దేశంలోనూ కనిపించదు. చేతిలో కొద్దిగా డబ్బులు కనిపిస్తే.. వెంటనే కొనుగోలు చేసేది బంగారాన్నే. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా.. పుత్తడి కొంటే.. శుభసూచకమని అంటుంటారు. అందుకే స్వర్ణం.. సమస్తమయమైపోయింది. ప్రపంచ మార్కెట్‌ పరిస్థితులు, డిమాండ్‌ నేపథ్యంలో రోజురోజుకీ పసిడి ధర పైపైకి ఎగబాకుతూ.. ఆల్‌టైమ్‌ హై రేట్‌ని నమోదు చేస్తోంది. 

ఒకప్పుడు 10 గ్రాముల ధరతో ఇప్పుడు గ్రాము కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి. వారం రోజులుగా ఎగబాకుతున్న బంగారాన్ని చూసి.. వెండి కూడా అదే బాటలో దూసుకుపోతోంది. లక్ష రూపాయల కంటే దిగువకు బంగారం ధర దిగే రోజులు ఇప్పట్లో కనిపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. 

తగ్గేదేలే అంటున్న పుత్తడి 
గత వారం రోజులుగా బంగారం ధర తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతోంది. ఈ నెల 8వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08, 380 ఉండగా.. 9వ తేదీన రూ.1,10,290కి చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.1.10 లక్షలకు తక్కువ కాలేదు. వెండి కూడా ధగధగ మెరిసిపోతోంది. ఈ నెల 8న కిలో వెండి ధర రూ.1.37 లక్షలు ఉండగా.. 15వ తేదీ నాటికి రూ.6 వేలు పెరిగి రూ.1.43 లక్షలకు చేరుకుంది. అంటే రోజుకు దాదాపు రూ.1000 చొప్పున పెరుగుతూ వస్తోంది.  

పెట్టుబడి విషయంలోనూ బంగారమే..! 
రోజు రోజుకీ ధర పెరుగుతూ వస్తున్నా బంగారం కొనుగోలు విషయంలో మాత్రం ప్రజలు అస్సలు తగ్గేదే..లే అంటున్నారు. ఎందుకంటే ఇంట్లో పసిడి ఎంత ఉంటే అంత ఎక్కువ సొమ్ము ఉన్నట్లుగా భావిస్తారు. వాస్తవానికి బంగారం నిరర్థక ఆస్తి. ఎంతో కష్టించి సంపాదించిన సొమ్ము బంగారంగా మార్చితే బీరువాల్లోనూ, బ్యాంకు లాకర్లలోనూ భద్రంగా ఉంచడం తప్ప... మరో ప్రయోజనం ఏంటి..? భవిష్యత్తులో ధర పెరిగి, పెరిగిన ధరకు దాన్ని విక్రయిస్తేనే లాభం. 

మనకు తెలిసినంత వరకూ బంగారం కొనడమే కానీ.. విక్రయించడమన్నది అరుదు. దీని బదులు వాటిని ఉత్పత్తి కార్యకలాపాలకు వెచ్చిస్తే సంపద సృష్టి జరుగుతుంది. మన దేశంలో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయడంలో బంగారం మూడో స్థానాన్ని ఆక్రమించింది. ముడిచమురు, క్యాపిటల్‌ గూడ్స్‌ తర్వాత అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న సరకు బంగారమేనన్నది విస్మయపరిచే అంశం. ఇటీవల కాలంలో మనదేశంలో బంగారం కొనుగోళ్లు అధికమై.. నగదు పొదుపు మొత్తాలు తగ్గిపోతున్నాయి. గృహస్తులు ఇతర వాటిపై ఒక్క శాతం పెట్టుబడులు పెడుతుండగా బంగారంపై మాత్రం ఆరున్నర రెట్లు ఎక్కువ మొగ్గు చూపుతుండటం విశేషం. 

బంగారానికి ఇంత వన్నె ఎందుకో..? 
పుత్తడి ఎంత ఉన్నా సగటు వ్యక్తికి మోజు తీరడం లేదు. తన శక్తి మేరకు బంగారాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అసలు బంగారానికి ఇంత వన్నె ఉండటానికి కారణం అంతర్జాతీయ కరెన్సీకి ప్రత్యామ్నాయం కావడమే. ఒక దేశం జారీ చేసిన నోట్లు చెల్లకపోవడం. వాటి విలువ క్షీణించడం ఉంటుంది. కానీ బంగారానికి అలాంటి బేధాలేమీ లేవు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతో కొంత ధరకు చెలామణి అవుతుంది. అందుకే స్వర్ణానికి అంత కళ. ధర తగ్గినా పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. 

ప్రపంచ స్వర్ణమండలి(డబ్ల్యూజీసీ) అంచనాల ప్రకారం ప్రస్తుతం దేశంలోని సంస్థలు, గృహస్తులు, రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా వద్ద 25 వేల టన్నుల బంగారం ఉంది. భారత్‌లో మొత్తం ఇళ్లల్లోనూ, ఇతర అవసరాలకు ఈ బంగారం వివిధ రూపాల్లో నిల్వ ఉంది. ఇందులో విశాఖ నగర జనాభా ప్రకారం 80 నుంచి 100 టన్నుల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం సగటున విశాఖ నగరంలో ప్రతి ఇంటిలోనూ 15 నుంచి 25 గ్రాములు వరకూ బంగారం ఉంటుదని నివేదికలు చెబుతున్నాయి.  

కొనుగోళ్లు తగ్గినా.. మార్కెట్‌ దూసుకుపోతోంది 
టెక్స్‌టైల్స్‌ మార్కెట్‌ 15 నుంచి 20 శాతం పడిపోయింది. బంగారం మార్కెట్‌ కూడా 15 నుంచి 20 శాతం పడిపోయింది. మార్కెట్‌ విలువ మాత్రం బంగారం విషయంలో ఏమాత్రం తగ్గలేదు. చైనా, భారత్‌ వంటి దేశాలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. గతంలో పసిడి ధర మూడు నాలుగు రోజులకోసారి మారేది. ఇప్పుడు ఒక పూట ఉన్న రేటు మరో పూటకు ఉండటం లేదు. 

బులియన్‌ మార్కెట్‌ కూడా అంచనా వేయలేకపోతోంది. పెట్టుబడుల విషయంలోనూ బంగారానికి మంచి డిమాండ్‌ ఉంది. బంగారంతో వెండి పోటీ పడుతోంది. బ్యాటరీ కార్లలో వెండి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ధరల పెరుగుదలకు ఓ కారణమని చెప్పవచ్చు.  – కంకటాల మల్లికార్జునరావు, ఫ్యాప్సీ పాస్ట్‌ ప్రెసిడెంట్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement