
నెల్లూరులో ఘాతుకం
కత్తితో పొడిచి హత్య చేసిన ప్రియుడు
మనస్పర్థల కారణంగానే దురాగతం!
పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు
నెల్లూరు (క్రైమ్): ఓ యువతిని కత్తితో పొడిచి ప్రేమికుడే కడతేర్చిన ఘటన శనివారం తెల్లవారుజామున నెల్లూరు నగరంలోని పోస్టల్ కాలనీలో జరిగింది. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబలి్లకి చెందిన గిరిబాబు, శ్రీలక్ష్మి దంపతులకు మైథిలిప్రియ (23), సాహితి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గిరిబాబు 2020లో గుండెపోటుతో మృతి చెందాడు. ప్రస్తుతం ఆ కుటుంబం మూలాపేటలో ఉంటోంది. మైథిలిప్రియ వెంకటాచలంలోని ఓ కళాశాలలో ఈ ఏడాది మార్చిలో బీఫార్మసీ పూర్తి చేసింది.
ఆమె బీఫార్మసీ చదివే సమయంలో అదే కళాశాలలో సహచర విద్యార్థి రాపూరు మండలానికి చెందిన నిఖిల్‌తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. మైథిలిప్రియ, ఆమె చెల్లెలు సాహితి పోస్టల్‌కాలనీ మొదటి వీధిలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఎదురు బిల్డింగ్‌లో నిఖిల్ ఉంటున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ మరో యువతితో సన్నిహితంగా ఉంటూ మైథిలితో తరచూ గొడవ పడుతుండేవాడు. సుమారు నాలుగు నెలల కిందట మైథిలికి బెంగళూరులోని అమెజాన్ కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆమె అక్కడకు వెళ్లింది.
పుట్టిన రోజు జరుపుకునేందుకు వచ్చి..
ఈ నెల 6న మైథిలి పుట్టిన రోజు కావడంతో 3న నెల్లూరుకు వచ్చింది. చెల్లెలు గదిలో ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు జరుపుకుంది. ఈ క్రమంలోనే నిఖిల్ పలుమార్లు ఆమెకు ఫోన్ చేసి గొడవ పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సాహితి అతనితో ఇక వద్దని అక్కకు సూచించింది. ఈ నెల 12న రాత్రి పొద్దుపోయే వరకు మైథిలి ఫోన్ చేసుకుంటూ ఉండగా సాహితి నిద్రపోయింది. 13వ తేదీ తెల్లవారుజామున సుమారు 1.45 గంటల ప్రాంతంలో సాహితి నిద్ర నుంచి లేచి చూడగా అక్క కనిపించకపోవడంతో ఆమెకు ఫోన్ చేసింది. ఫ్రెండ్స్‌తో ఉన్నానని, పది నిమిషాల్లో వస్తానని, నిఖిల్‌కు ఫోన్ చేయొద్దని చెప్పింది. దీంతో సాహితి తిరిగి నిద్రపోయింది. సుమారు 3.35 గంటల ప్రాంతంలో ‘‘మీ అక్క నా వద్ద ఉందని, వచ్చి తీసుకెళ్లు’’ అని నిఖిల్ సాహితికి ఫోన్ చేసి చెప్పాడు. సాహితి తన స్నేహితురాలు, రూమ్ కింద ఉంటున్న ఓ మహిళను తీసుకుని నిఖిల్ గది వద్దకు వెళ్లింది. అక్కడ మెట్లపై మైథిలి విగతజీవిగా ఉంది. ఆమె ఎడమ చంక కింద కత్తి పోటు ఉంది.
రక్తస్రావమైంది. దీంతో తన అక్కకు ఏమైందని నిఖిల్‌ను నిలదీయగా తనతో గొడవపడడంతో కత్తితో పొడిచానని నిఖిల్ చెప్పాడు. సాహితి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సాహితి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నిఖిల్ దర్గామిట్ట పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. తన కుమార్తెను హత్య చేసిన నిఖిల్‌ను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి శ్రీలక్ష్మి పోలీసు అధికారులను కోరారు.