మంగళగిరి టౌన్: వేరే వ్యక్తితో కలిసి ఉంటున్న భార్యను భర్త గొంతునులిమి హత్య చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... పెనమలూరు మండలం పెదపులిపాకలో శంకరరెడ్డి తన భార్య లక్ష్మీపార్వతి (29)తో ఉంటున్నాడు. మిఠాయి కార్కానాలో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఎనిమిది నెలల క్రితం మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. అయిదు నెలల క్రితం మంగళగిరి మండల పరిధిలోని చినకాకాని గ్రామానికి లక్ష్మీపార్వతి వచ్చింది. స్థానికంగా ఎల్రక్టీషియన్‌గా పనిచేసే మహేష్‌తో పరిచయం ఏర్పడింది.
మంగళగిరి మండలం పరిధిలోని యర్రబాలెంలో ఇద్దరు కలిసి నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న శంకరరెడ్డి మంగళవారం మధ్యాహ్నం లక్ష్మీపార్వతి నివాసానికి వెళ్లి గొడవ పడ్డాడు. పెద్దగా వాగ్వాదం జరిగింది. లక్ష్మీపార్వతి పరిగెత్తుకుంటూ వచ్చి పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్లింది. శంకరరెడ్డి కూడా ఆమెను వెంబడించి లోపలికి వెళ్లి గడి పెట్టాడు. భార్య గొంతు నులిమి హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు రూరల్ సీఐ బ్రహ్మం సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని వైద్యశాలకు పంపారు. శంకరరెడ్డి పరారీలో ఉన్నాడని, ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


