దంపతుల పరస్పర దాడి భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం

Wife And Husband Clashes Husband Deceased In West Godavari - Sakshi

పాలకోడేరు(ఉండి): దంపతుల మధ్య మాటామాటా పెరిగి పట్టరాని ఆవేశంతో ఒకరినొకరు కొట్టుకోవడంతో భర్త మృతి చెందగా.. భార్య ఆస్పత్రి పాలై మృత్యువుతో పోరాడుతోంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గొల్లలకోడేరు సంజనా అపార్ట్‌మెంట్‌లోని సివికా ఫ్లాట్‌–311లో కనుమూరి విజయరామరాజు (80), సరళాదేవి (70) కాపురం ఉంటున్నారు. వీరిద్దరిదీ ద్వితీయ వివాహమే. తరచూ ప్రతి విషయానికీ కీచులాడుకునేవారు. సోమవారం ఉదయం కూడా వీరిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.

బంధువుల ఇంటికి పెళ్లిళ్లకు వెళ్లి నెల రోజులు ఉండి వస్తానని భార్య అంటే.. తాను కుమారుడి ఇంటికి వెళ్తానని భర్త అన్నాడని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మాటామాటా పెరిగింది. దీంతో పచ్చడి చేసుకునే పొత్రంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కొద్దిసేపటికి భర్త మృతి చెందగా, భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అదే అపార్ట్‌మెంట్‌లోని 411 ఫ్లాట్‌లో ఉంటున్న సమీప బంధువు సమాచారం తెలుసుకుని అక్కడికి వచ్చి తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. ప్రాణాలతో ఉన్న సరళాదేవిని భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top