వర్ష బీభత్సం

Weather Forecast: Heavy Rainfall Record In Anakapalle - Sakshi

అర్ధరాత్రి గంటపాటు కుంభవృష్టి 

అధిక వర్షపాతం నమోదు 

నీట మునిగిన వరి పనలు 

నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు 

అనకాపల్లి: అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. అర్ధరాత్రి వేళ వర్ష బీభత్సం జిల్లాను అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి 12 గంటలు దాటాక గాలివాన మొదలైంది. కుంభవృష్టి కురిసింది. పలు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కురిసింది గంటపాటే అయిన అధిక వర్షపాతం నమోదైంది.

మునగపాకలో అత్యధికంగా 92.6 మిల్లీమీటర్లు, కశింకోటలో 90.2 మి.మీ. వర్షం పడింది. ఈదురుగాలుల బీభత్సానికి అనకాపల్లి, యలమంచిలి, చోడవరం నియోజకవర్గాల పరిధిలో చెట్లు నేలకొరిగాయి. చోడవరంలో 15 విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. అనకాపల్లి, యలమంచిలి పరిధిలో అక్కడక్కడ విద్యుత్‌స్తంభాలు విరిగిపడ్డాయి. పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు రాత్రంతా అంతరాయం ఏర్పడింది.

బుధవారం ఉదయం నుంచి పునరుద్ధరణ పనులు చేపట్టారు. అనకాపల్లిలో రైల్వే బ్రిడ్జి కింద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను లక్ష్మీదేవిపేట రైల్వేగేటు వైపు మళ్లించారు. పలు చోట్ల కూలిన చెట్లను ఆయా కాలనీల వారు స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. బుచ్చెయ్యపేట మండలం నీలకంఠాపురం గ్రామంలో కోరుకొండ తాతయ్యలకు చెందిన పాడి గేదెపై తాటిచెట్టు విరిగి పడింది. వడ్డాది కస్పా, విజయరామరాజుపేట, మంగళాపురం, కుముదాంపేట, బంగారుమెట్ట తదితర గ్రామాల్లో రబీ వరి పంటకు తీవ్రంగా నష్టం జరిగింది. కోసిన వరి పనులు నీట మునిగిపోయాయి. పలు గ్రామాల్లో అరటి, మామిడి, అపరాలు, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి.  

పిడుగుపాటుకు పూరిల్లు దగ్ధం 
గొలుగొండ: మండలంలో ఏఎల్‌పురం గ్రామానికి చెందిన కె.నాగరాజు ఇల్లు మంగళవారం అర్ధరాత్రి పిడుగుపాటుకు కాలిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బుధవారం వీఆర్వో శ్రీధర్‌ వచ్చి బాధితులను పరామర్శించారు. 

రైతులకు నష్టం 
మునగపాక: ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగిపోయాయి. దీంతో రాత్రంతా అంధకారం నెలకొంది. ఆవ ప్రాంతంలో కోసిన వరి పనలు నీట మునిగిపోయాయి. అకాల వర్షం రైతులకు నష్టం మిగిల్చింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top