విరబూసిన విద్యావనం | Vikrama Sinhapuri University Graduation Festival | Sakshi
Sakshi News home page

విరబూసిన విద్యావనం

May 24 2022 11:41 AM | Updated on May 24 2022 11:47 AM

Vikrama Sinhapuri University Graduation Festival - Sakshi

చారిత్రక సింహపురి పేరుతో పురుడు పోసుకున్న విక్రమసింహపురి యూనివర్సిటీ అనతికాలంలో పేరెన్నిక వర్సిటీల సరసన నిలిచేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. జిల్లాలోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దరి చేర్చాలన్న సమున్నత సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సృష్టించిన వర్సిటీ సత్ఫలితాలను సాధిస్తోంది. వర్సిటీ, అనుబంధ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ సగర్వంగా స్నాతకోత్సవాల పండగ చేసుకుంటోంది. మంగళవారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ చేతుల మీదుగా విద్యార్థులకు పట్టాలను అందించనుంది.  

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సింహపురి విద్యావనంలో విద్యా కుసుమాలు విరగబూస్తున్నాయి. ఉన్నత సంకల్పంతో నెలకొల్పిన యూనివర్సిటీ సత్ఫలితాలు సాధిస్తోంది. ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా దినదినాభివృద్ధి చెందుతూ విక్రమ సింహపురి యూనివర్సిటీ దేశంలోనే అగ్రగామి వర్సిటీగా పరిణతి చెందుతోంది. అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన జిల్లాలో విద్యా వర్సిటీ లేకపోవడాన్ని గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008లో విక్రమసింహపురిగా పేరొందిన నెల్లూరులో అదే పేరుతో వర్సిటీని ఏర్పాటు చేశారు.

తొలుత పరాయి పంచన ప్రారంభించిన వర్సిటీకి నెల్లూరుకు కూతవేటు దూరంలోని కాకుటూరులో 87 ఎకరాల విస్తీర్ణంలో సర్వాంగ హంగులతో వర్సిటీ సొంత భవనానికి పునాదులు వేశారు. పుష్కర కాలంలోనే వైభవంగా వెలుగొందుతున్న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం 6, 7 స్నాతకోత్సవాలను మంగళవారం నిర్వహిస్తోంది.  ఈ కార్యక్రమాన్ని వీఎస్‌యూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. గవర్నర్‌ బిశ్వభూషణ్, మంత్రి బొత్స సత్యనారాయణ, హైదరాబాద్‌ మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ డీఎన్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.  

26 గోల్డ్‌మెడల్స్‌ అందజేత  
వర్సిటీ స్నాతకోత్సవంలో వివిధ విభాగాల్లో అత్యున్నత ప్రతిభ చాటిన 19 మంది విద్యార్థులకు 26 గోల్డ్‌ మెడల్స్‌ను అందించనున్నారు. 252 మందికి ప్రత్యక్షంగా, 4,071 మంది విద్యార్థులకు  తపాలా ద్వారా పట్టాలు అందించేందుకు ప్రణాళికలు చేపట్టారు. 

శ్రీసిటీ సృష్టికర్తకు గౌవర డాక్టరేట్‌  
పల్లెటూళ్లను పరిశ్రమల గూళ్లుగా మార్చిన శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డికి విక్రమ సింహపురి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ అందిస్తోంది. తడ–సత్యవేడు మండలాల మధ్య 5,700 ఎకరాల్లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులతో చేపట్టిన శ్రీసిటీకి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. 28 దేశాలకు చెందిన 200 పరిశ్రమలు పైగా శ్రీసిటీలో నెలకొల్పారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా 50 వేల మందికి ఉపాధి లభిస్తోంది. అందుకు కారకులైన ఎండీ రవీంద్ర సన్నారెడ్డికి గవర్నర్‌ చేతుల మీదుగా డాక్టరేట్‌ అందించనున్నారు.  

సామాజిక బాధ్యతలో ప్రత్యేకత  
వర్సిటీ సామాజిక బాధ్యతను గుర్తెరిగింది. కరోనా కారణంగా మైక్రోసాఫ్ట్‌ టీమ్స్, జూమ్, గూగుల్‌ మీట్‌ వంటి మొబైల్‌ అప్లికేషన్లు ద్వారా బోధన చేసి, సకాలంలో పరీక్షలు నిర్వహించి సత్ఫలితాలు సాధించింది. 2019లో ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగంలో భారతదేశంలోనే రెండో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా వీఎస్‌యూ నిలిచింది. 2020లో రాష్ట్ర ఉత్తమ వలంటీర్‌ అవార్డు, 2021లో యూత్‌ ఐకాన్‌ అవార్డు దక్కించుకుంది. వర్సిటీ ఆధ్వర్యంలో వివిధ క్రీడలకు సంబంధించి 19 జట్లలోని 164 మంది విద్యార్థులు జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదిగారు. ఈ ప్రాంత ప్రయోజనాలకు అనుగుణంగా వర్సిటీని తీర్చిదిదేందుకు వైస్‌ చాన్సలర్‌ జీఎం సుందరవల్లి, రిజిస్ట్రార్‌ ఎల్వీ కృష్ణారెడ్డి ప్రత్యేక ప్రణాళికలు రచించారు. 

ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింత ముందుకు 
ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింత ముందుకు దూసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే వర్సిటీలో 17 విభాగాలు ఉన్నాయి. జిల్లాకు అనువుగా మరిన్నీ సబ్జెక్ట్‌లు ప్రవేశ పెట్టేందుకు నిపుణుల కమిటీ నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నాం. రీసెర్చ్‌కు ప్రాధాన్యం ఇçవ్వనున్నాం. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నాం. అవసరమైన మేరకు దాతల సహకారం కోరుతున్నాం. సామాజిక బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని అనుగుణంగా తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు రచించుకున్నాం.   
– ఎల్‌ విజయకృష్ణారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement